మహబూబ్‌నగర్, జనవరి 28 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : పల్లి రైతులు మ రోసారి ఆందోళన బాటపట్టారు. మద్దతు ధర దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంగళవారం మహబూబ్‌నగర్‌లో ధర్నాకు దిగారు. మద్దతు ధర చెల్లించాలని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంతోపాటు నవాబ్‌పేట, గండీడ్, మ హ్మదాబాద్ మండలాల నుంచి రైతులు వందల క్వింటాళ్ల పల్ల్లిని మార్కెట్‌కు తెచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు 6,190, కనిష్ఠంగా రూ.3,300 ధర నిర్ణయించారు. వ్యాపారులు మాత్రం రూ.5,700 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు కన్నెర్ర చేశారు. దీనికితోడు తక్కువ తూకంతో మోసానికి పాల్పడుతున్నారని, వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళనకు దిగారు. దాదాపు 4 గంటలపాటు మార్కెట్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. సమీపంలోని బోయపల్లి గేట్ వద్ద రైల్వే లైన్‌పై బైఠాయించారు. అదే సమయంలో అటుగా వస్తున్న గూడ్స్‌ను లోకో పైలట్ చాకచక్యంగా నిలిపివేశాడు. రూరల్, వన్ టౌన్ సీఐలు గాంధీనాయక్, అప్పయ్య ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారుతుండటంతో ఎస్పీ జానకి రైతుల వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే లైన్‌పై ఉన్న రైతులను సముదాయించి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు.
ఓ పక్క ఆందోళన చేస్తుంటే.. మరో పక్క పాలకవర్గంతోపాటు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. చివరకు దిగొచ్చిన మార్కెట్ అధికారులు వ్యాపారులతో చర్చించి క్వింటాకు రూ.200 మేర పెంచుతామని హామీ ఇచ్చారు. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో రైతులు శాంతించారు.