RYTHU BIMA | హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పథకం రాష్ట్రంలోని లక్షలాది రైతు కుంటుబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నది. గత ఐదేండ్లలో వివిధ కారణాలతో 1,08,051 మంది రైతులు చనిపోగా, ఈ పథకం కింద ఆయా కుటుంబాలకు రూ.ఐదేసి లక్షల చొప్పున 5,402.55 కోట్ల పరిహారం అందింది. రైతుకు ఎంత భూమి ఉన్నదనే అంశంతో సంబంధం లేకుండా 18-59 ఏండ్ల వయసు రైతులందరికీ రైతుబీమా అమలవుతున్నది. రైతుల మీద నయాపైసా భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తున్నది. గత సంవత్సరం అర్హులైన 37.7 లక్షల మంది రైతుల తరుపున ప్రభుత్వం ఎల్ఐసీకి రూ.1,446.59 కోట్లు చెల్లించింది. అంటే ఒక్కో రైతు తరపున రూ.3,831 చొప్పున చెల్లించడం గమనార్హం. గత ఐదేండ్లలో రైతుల తరుపున ప్రభుత్వం రూ.5,383.83 కోట్లు, తాజాగా 2023-24 సంవత్సరానికి మరో రూ.1,477.64 కోట్లు చెల్లించింది. దీంతో ఇప్పటివరకు ఎల్ఐసీకి చెల్లించిన ప్రీమియం మొత్తం రూ.6,861.47 కోట్లకు చేరింది. రైతుబీమా కోసం దేశంలో ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే. ఏటేటా రైతుల తరుపున చెల్లించాల్సిన ప్రీమియం భారం పెరుగుతున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఇది రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనం.
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చివరికి రైతుల అకాల మరణంపైనా రాజకీయం చేస్తున్నాయి. అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు అండగా నిలువాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం రైతుబీమా లబ్ధిదారుల సంఖ్యపైనా రాద్ధాంతం చేస్తున్నాయి. రైతుబీమా పథకం ద్వారా లక్ష రైతు కుటుంబాలకు పరిహారం అందిస్తే.. ఆ లక్ష మంది రైతులు వ్యవసాయ నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి యాక్సిడెంట్, అనారోగ్యం, ఇలా ఏ కారణంతో రైతు చనిపోయినా రైతుబీమా వర్తిస్తున్నది. ఈ విధమైన బీమా పరిహారం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. కొన్ని రాష్ర్టాల్లో రైతులకు కేవలం వ్యవసాయ ప్రమాద బీమాను మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఇందులో కూడా ఒకట్రెండు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
2023-24 సంవత్సరానికి మరో 3.34 లక్షల మంది రైతులు రైతుబీమా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రైతుబీమా పరిధిలో ఉన్న రైతుల సంఖ్య 37.70 లక్షలు ఉండగా ఈ ఏడాది 41.04 లక్షలకు పెరిగింది. దీంతో 41.04 లక్షల మంది రైతుల తరుపున ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,477.64 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఏటేటా రైతుల సంఖ్యతో పాటు ప్రీమియం మొత్తం కూడా పెరుగుతున్నది. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా ప్రభుత్వం రూ.602.19 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా, నయా పైసా భారం లేకుండా రైతులకు రైతుబీమా అమలు చేయడంపై ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మాకు రెండెకరాల భూమి ఉన్నది. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని ఎవుసం చేసేది. నా భర్త సంపత్ ఎవుసంతోపాటు ఒగ్గు కథలు చెప్తూ కుటుంబాన్ని సాకేది. మాకు ఇద్దరు పిల్లలు.. నాని (6వ తరగతి), హన్సిక (2వ తరగతి). కౌలుకు తీసుకున్న భూమిల మక్కజొన్న వేసినం. పోయిన జనవరి 3న పంటకు నీళ్లు పెట్టడానికి నేను, నా భర్త కలిసి పోయినం. అక్కడ కరెంట్ మోటర్ షాక్ కొట్టడంతో నా కండ్ల ముందే ప్రాణాలు ఇడిచిండు. ఇంటి పెద్దదిక్కు పోయిండు.. ఎట్ల బతుకుడు దేవుడా? అని బాధపడుతున్న సమయంల మాకు ప్రభుత్వం రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇచ్చింది. అవి నా పిల్లలను చదివించుకోవడానికి అక్కెరకు అత్తున్నయ్. కొన్ని పైసలు మా బిడ్డ పేర బ్యాంక్‌ల ఏసుకున్న. బీమా పథకమే లేకపోతే మా బతుకులు ఎట్లా ఉండునోనని తలచుకుంటే భయమేసింది. ఈ సాయం చేసిన కేసీఆర్ సార్‌ను ఎప్పటికీ మరువం.
– వీరముష్టి స్వప్న, మృతి చెందిన రైతు భార్య, గూడెం(ఓదెల)