Minister Tummala | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఎప్పుడో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడో జూలైలో ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడిసాయం ఇప్పటికీ పైసా రాలేదు. ఇక ఇప్పుడు ఈ రెండింటికీ ప్రభుత్వం లంకె పెట్టింది. రుణమాఫీ పూర్తి చేసిన తర్వాతే రైతుభరోసా గురించి ఆలోచిస్తామని స్వ యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో ‘రుణమాఫీకి రూ.18 వేల కోట్లు ఇచ్చినం. ఇంకా రూ. 13వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. అమౌంట్ సమకూరే వెసులుబాటు ఆధారంగా రైతులకు డేట్ ఇస్తాం. ఆ తర్వాత రైతులు మిగిలిన అమౌంట్ చెల్లించగానే రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాలో వేస్తాం. ఇక ఇది(రుణమాఫీ) పూర్తయిన తర్వాత అది(రైతుభరోసా) వస్తది’ అంటూ కుండబద్దలు కొట్టారు.
రుణమాఫీతో రైతుభరోసాకు లింకు పెట్టడంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ పూర్తయ్యేదెప్పుడు… రైతుభరోసా ఇచ్చేదెప్పుడు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పూర్తి చేసేందుకే ఇంకా రూ. 13 వేల కోట్లు కావాలి. 2 లక్షలకుపైగా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా కుటుంబ నిర్ధారణ దశలోనే ఉన్నది. దీనికి ప్రత్యేకంగా గైడ్లైన్ జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ సడీసప్పుడు చేయడం లేదు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణమాఫీకి లింకు పెట్టిన రైతుభరోసా కూడా వచ్చే పరిస్థితిలేదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
పంటల సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం.. పంటలు కోతకొస్తున్నా అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వారంలో కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలుకానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వంలో రైతుభరోసా పంపిణీపై కనీసం చర్చ జరగడంలేదని తెలిసింది. సీఎం రేవంత్రెడ్డిగానీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగానీ రైతుభరోసాపై సమీక్ష కూడా చేయకపోవడం విమర్శలకు బలాన్నిస్తున్నది. పెట్టుబడి కోసం ప్రభుత్వం సాయం చేయకపోవడంతో రైతులు అప్పో సొప్పో చేసి పంటలు సాగు చేసుకున్నారు. మరో పది రోజుల్లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. కనీసం ఈ సమయానికైనా ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు వేస్తే రైతులు మళ్లీ అప్పు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతుభరోసాకు కనీసం రూ. 11వేల కోట్లు కావాలి. కానీ రుణమాఫీకే అపసోపాలు పడుతున్న ప్రభుత్వం రైతుభరోసా ఇస్తుందనే నమ్మకం లేదని రైతులు చెబుతున్నారు.