హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): వానకాలం రైతుభరోసాను శరవేగంగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్న కాంగ్రెస్ సర్కారు గత యాసంగి రైతుభరోసా బకాయిలపై మాత్రం నోరెత్తడం లేదు. ఆ బకాయిల చెల్లింపుపై ఎలాంటి ప్రకటన కూడా చేయడం లేదు. దీంతో యాసంగి రైతుభరోసాకు ప్రభుత్వం నీళ్లొదిలినట్టేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
గత యాసంగికి సంబంధించి 153 లక్షల ఎకరాలకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.9,200 కోట్లు రైతుభరోసా కింద చెల్లించాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే చెల్లించి మిగతా రూ.4,200 కోట్లను బకాయి పెట్టింది. ఇప్పటివరకు ఈ బకాయిలను చెల్లించనే లేదు. దీంతో నాడు భరోసా దక్కని రైతులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ సీజన్లో గత సీజన్ బకాయిలతో కలిపి పంపిణీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా యాసంగి బకాయిలను పక్కనపెట్టిన ప్రభుత్వం వానకాలం రైతుభరోసా పంపిణీని ప్రారంభించింది. ఇప్పటివరకు తొమ్మిదెకరాల వరకు 66.19 లక్షల మంది రైతులకు రూ.7,770 కోట్లను పంపిణీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేనంతగా ఈ ఒక్క సీజన్లోనే ఆగమేఘాలపై రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 2023-24 యాసంగి సీజన్ రైతుభరోసాను డిసెంబర్లో వేయాల్సి ఉండగా, మే నెలలో జమచేసింది. ఆ తర్వాత 2024-25 సీజన్లో వానకాలం రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. గత యాసంగి సీజన్లో సగం పంపిణీ చేసిన ప్రభుత్వం మిగతా సగానికి మొండిచేయి చూపింది. ఈ సీజన్లో ఆగమేఘాలపై రైతుభరోసాను పంపిణీ చేస్తుండటంతో రైతుల్లో ఆశ్చర్యంతోపాటు అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక పంచాయతీ ఎన్నికల ఆలోచన ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. ఈ నెలాఖరులో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకతను తగ్గించడానికి, వారిని మచ్చిక చేసుకోవడానికి హడావుడిగా రైతుభరోసా సాయాన్ని విడుదల చేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.