హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడుపేనట. ఆ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన, అసలైన సంక్షేమ పథకమట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారే ఈ వింతైన విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు బుధవారం రాత్రి హడావుడిగా విడుదల చేసిన కుటుంబ సర్వే నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదికలో ఏ పథకం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందారనే అంశాన్ని వివరించింది. దీంతో సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా రూ.30 వేల కోట్ల వరకు ఖర్చుచేస్తూ వ్యవసాయ సంక్షేమ పథకాలైన రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలను రైతులకు అందిస్తున్నట్టు పేర్కొన్నది.
ఈ పథకాలను ఓసీలు 15 శాతం లబ్ధి పొందితే ఎస్సీలు కేవలం 12 శాతం మాత్రమే లబ్ధి పొందుతున్నట్టు వెల్లడించింది. ఉచిత బస్సు పథకాన్ని 20 శాతం మంది ఎస్సీలు వినియోగించుకొంటే.. ఓసీలు 10శాతమేనని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు వ్యవసాయ పథకాల కన్నా ఉచిత బస్సు పథకమే నిజమైన సంక్షేమ పథకమనే విషయాన్ని స్పష్టం చేస్తున్నదని ప్రభుత్వం పేర్కొన్నది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచి దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన పథకాలపై ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలతో ఉచిత బస్సు ప్రయాణానికి పోలిక ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పథకాలను పోల్చడమే పెద్ద తప్పు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రైతు పథకాలను తక్కువ చేసి చూపడం మరింత దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సొంత భూమి కలిగిన వారిలో ఓసీలే తక్కువ
రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాలు 35.6 శాతంగా ఉన్నట్టు సర్కార్ నివేదిక పేర్కొన్నది. కులాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఎస్టీ సామాజిక వర్గం ముందుగా ఉండటం గమనార్హం. ఎస్టీలు 58.1శాతం సొంత భూమి కలిగి ఉన్నట్టు పేర్కొన్నది. ఈ తర్వాతి స్థానంలో బీసీల కుటుంబాలు 36.3 శాతం, ఎస్సీలు 35.2 శాతం, ఓసీలు 33.7 శాతం సొంత భూమి కలిగి ఉన్నట్టు వెల్లడించింది. ఇలా రాష్ట్రంలో సొంత భూమి కలిగిన కుటుంబాల్లో ఓసీలే తక్కువగా ఉండటం గమనార్హం.