హైదరాబాద్: పదో విడత రైతుబంధులో భాగంగా రెండో రోజు పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. తొలిరోజు ఎకరం చొప్పున 22,45,137 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.758,19,25,476 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. నేడు మరో 15.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమచేసింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున 24,36,775 ఎకరాలకు రూ.1,218.38 కోట్లు బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. ఇప్పటివరకు 9 విడతల్లో సాయం అందించగా, 10వ విడత కింద 70.54 లక్షల మందికి రూ.5 వేల చొప్పున రూ.7,676.61 కోట్లను అందజేయనున్నది. 9 విడతల్లో రైతాంగానికి రూ.57,882 కోట్లు సాయం చేయగా, 10వ విడతతో కలిపి మొత్తం రూ.65,559.28 కోట్లు రైతుబంధు పథకానికి వెచ్చించినట్టవుతుంది.
పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కాగా, వ్యవసాయ వృద్ధి కోసమే రైతు బంధు పథకమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు.