హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3న తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించనున్నట్టు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఎం రఘునందన్‌రావుతో కలిసి బుధవారం రైతుబంధు కోఆర్డినేటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దశాబ్దకాలంలో వ్యవసాయ రంగంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధించిందని పేర్కొన్నారు.
2014-15లో వరి ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకున్నట్టు తెలిపారు. ఉత్పాదకతలో రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇది నిదర్శనమని కొనియాడారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ.. గత దశాబ్దకాలంలో దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కో-ఆర్డినేటర్లతో కలిసి ఆవిష్కరించారు.