మొయినాబాద్, జనవరి 6: ‘తెలంగాణ రైతులు అదృష్టవంతులు. ఇక్కడి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శామ్యూల్ ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని శ్రీరాంనగర్ గ్రామాన్ని సందర్శించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయని వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారీ వ్యవస్థను తొలగించాలని, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని, రైతులకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎస్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ శ్యామ్యూల్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి హనుమంత్ జెండగే మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఫార్మర్ సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవచ్చని రైతులకు సూచించారు. దేశంలో 10 వేల ఫార్మర్ ప్రొడ్యూస్ సొసైటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. కార్యక్రమంలో నారమ్ డైరెక్టర్ జనరల్ చంద్రశేఖర్, మేనేజర్ సాగర్ దేశ్‌ముఖ్, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.