Rythu Bandhu | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రంగప్రవేశంతో మహారాష్ట్రలో పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదం రైతులనే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా కదిలిస్తున్నది. తెలంగాణలో అమల్లో ఉన్న రైతు సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలుచేయాలని అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుండగా, తాజాగా సీనియర్ సివిల్ సర్వీస్ అధికారి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయటం బీఆర్ఎస్ ప్రభావాన్ని స్పష్టంగా తెలిపింది. తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని తక్షణం మహారాష్ట్రలో అమలుచేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ సునీల్ కేంద్రేకర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపాలంటే ఈ పథకాన్ని వెంటనే అమల్లోకి తేవాలని మీడియా సమావేశంలోనే కుండబద్దలు కొట్టారు. మరాఠ్వాడ ప్రాంతంలో వ్యవసాయంలో అప్పులపాలైన రైతులు అనేకమంది నిత్యం ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఈ ఆత్మహత్యలను ఆపాలంటే ఏంచేయాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్రేకర్.. రైతుబంధు ద్వారా ప్రతిరైతుకు ఎకరానికి ఏటా రూ.10,000 పెట్టుబడి సాయం అందిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పారు.
పరిస్థితి ఆందోళనకరం
మహారాష్ట్రలోని మరాఠ్వాడలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నదని కేంద్రేకర్ చెప్పారు. ‘మేం కొన్ని బాధిత కుటుంబాలతో మాట్లాడాం. వారు చెప్పిందంతా ఓపికతో విన్నాం. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకొన్న కొన్ని కుటుంబాలకు ప్రస్తుతం సహా యం అందుతున్నది. కానీ, పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా ఉన్నది. సామాజిక, ఆర్థిక దుర్బలత్వంతో ఇక్కడి రైతులు అలసిపోయారు. ఆర్థిక సమస్యలతో రైతుల పిల్లలు స్కూళ్లు మానేస్తున్నారు. వారి ఇండ్లలో ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేయలేకపోతున్నారు.
భూమి ఉన్నా సాగునీటి వసతి లేక పంట దిగుబడి చాలా తక్కువగా వస్తున్నది. ఈ పరిస్థితిలో తెలంగాణలో అమల్లో ఉన్న రైతుబంధు పథకంలాంటిది ఇక్కడ కూడా అమలు చేయటం తక్షణావసరం. పంట వేయటానికి ముందే రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందిస్తే విత్తనాలు, పురుగుమందులు ఇతర వ్యవసాయ వస్తువులు కొనుక్కొంటారు. ఇదే విషయాన్ని మేం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని వివరించారు.
ఒక్క ఏడాదిలో వెయ్యి మంది ఆత్మహత్య
రైతుల ఆత్మహత్యలో దేశంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉన్నది. ముఖ్యంగా మరాఠ్వాడ ప్రాంతంలో 2022 ఒక్క ఏడాదిలోనే 1023 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. 2001 నుంచి ఈ ప్రాంతంలో ఏకంగా 10,431 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఔరంగాబాద్, బీడ్, హింగోలి, జాల్నా, లాతూర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్భణి జిల్లాలను కలిపి మరాఠ్వాడ అంటారు.
ఈ ప్రాంతంలో సారవంతమైన భూములు ఉన్నా సరైన నీటి వసతి లేదు. దీంతో రైతులు పూర్తిగా వర్షాలమీదనే ఆధాపడి పంటలు పండిస్తారు. కొన్నిసార్లు అతివృష్టి, మరికొన్నిసార్లు అనావృష్టితో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా గత ఐదేండ్లలో మహారాష్ట్రలో ఏకంగా 3.6 కోట్ల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గత ఏడాదే ఏకంగా 46 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. వీటి విలువ రూ.7 వేల కోట్లుగా అంచనా వేశారు.