రైతుబంధు పైసలు వస్తే మనసంతా సంతోషం. ఈ చిత్రంలో కనిపిస్తున్న రెడ్యానాయక్, బుజ్జీబాయ్ దంపతులు ఆ ఆనందాన్నే ఆస్వాదిస్తున్నారు. తమ ఖాతాల్లో జమైన రైతుబంధు డబ్బులను డ్రా చేసుకొని, వాటినే చూస్తూ మురిసిపోతున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రవల్లితండాకు చెందిన ఈ దంపతులకు ఎకరం భూమి ఉండగా వీరి ఖాతాలో రూ. 5వేలు జమ అయ్యాయి.

వరంగల్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): మంద శ్రీనివాస్‌ది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామం. ఆయనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆయనతోపాటు ఆయన భార్య కూడా వ్యవసాయ పనులు చేస్తారు. పంట పెట్టుబడి కోసం గతంలో శ్రీనివాస్ అనేక ఇబ్బందులు పడేవారు. భార్యతో కలిసి కూలి పనులకు వెళ్లి కొంత డబ్బు పోగు చేసేవారు. తీరా అది చాలక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాడు. రెండు, మూడు రూపాయల వడ్డీతో అప్పులు చేసేవారు. అప్పు సమయానికి దొరకక టెన్షన్ పడేవారు. పంట పండిన తర్వాత ఉత్పత్తులను అమ్మి వడ్డీ సహా అప్పు తీర్చేవారు. పొద్దస్తమానం కష్టపడ్డా చివరకు అప్పులు, వడ్డీలు పోను ఏమీ మిగిలేది కాదు. దీంతో ఒక దశలో తనకు వ్యవసాయంపైనే విరక్తి కలిగిందని చెప్తుంటారు శ్రీనివాస్. అయితే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చిన తరువాత తన పరిస్థితి చాలా మెరుగైందని చెప్తున్నాడు. ఆయనలో ధీమా పెరిగింది. పెట్టుబడికి అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది.
పంట పెట్టుబడికి భరోసా దొరికింది. కూలి పనులకు వెళ్తేనే పంట పెట్టుబడి అవసరాలు తీరుతాయనే బాధ తప్పింది. ఆయనకు ఉన్న రెండెకరాలకు రైతుబంధు కింద ఏటా రెండు విడతల్లో రూ.20 వేలు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నది. దీంతో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నానని సంతోషంగా చెప్తున్నారు. తాజాగా గురువారం శ్రీనివాస్ ఖాతాలో రైతుబంధు సాయం రూ.10 వేలు జమైంది. రైతుబంధు రూపంలో శ్రీనివాస్‌కు పంట పెట్టుబడి సాయం అందడం ఇది పదోసారి. రైతుబంధు వచ్చిన తర్వాత ఇప్పటివరకు పంట పెట్టుబడి కోసం శ్రీనివాస్ అప్పు చేయలేదు. రైతుబంధు సొమ్ములు తన బ్యాంకు ఖాతాలో జమ కాగానే ఆ డబ్బుతో ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నానని, ఇతర పెట్టుబడులకు వినియోగిస్తున్నామని శ్రీనివాస్ చెప్తున్నారు. పండిన పంటను మార్కెట్లో అమ్మి ఆదాయం పొందుతున్నామని, కుటుంబ అవసరాలు తీరుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పండిన పంటఅప్పుకే సరిపోయేది

నా పేరుపై రెండెకరాల పొలం ఉన్నది. తెలంగాణ రాక ముందు పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడేది. పంట పండినా షావుకారి వద్ద అప్పులు, వడ్డీకే సరిపోయేది. ఏం చేయాలో తోచక లోలోపల మదనపడేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా రెండెకరాల భూమికి పట్టా పాస్‌బుక్ వచ్చింది. అన్నదాత బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చిండు. ఆ డబ్బులు పడగానే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తున్నది. వెంటనే వాటిని ఇడిపించుకొని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తెచ్చుకుంటున్న. నాటు వేసిన కూలీలకు కూడా డబ్బులు సరిపోతున్నయ్. కేసీఆర్ సార్ దయవల్ల అప్పులు తెచ్చుడు తప్పింది. సంబురంగా ఎవుసం చేస్తున్నా. నా ఎరుకల ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే. ఆయన వెంటే ఉంటాం.
– రామచంద్రపు లక్ష్మయ్య, బేతోలు గ్రామం, మహబూబాబాద్ జిల్లా
వడ్డీలు కడుతుండె.. అసలు తీరకపోతుండె..

తెలంగాణ రాక మునుపు లాగోడీ పైసలకు వడ్డీ ఇచ్చేటోళ్ల దగ్గరకు పోతుండే. చేతికొచ్చిన పంట డబ్బులు వడ్డీలకే అయితుండే. కేసీఆర్ సీఎం అయినంక రైతులకు ఆ ఇబ్బంది లేకుండాపోయింది.అప్పు కోసం చేయి సాపే పనిలేకుండా పోయింది. సీఎం కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నారు. పండించిన పంట ఊళ్లోనే కొంటున్నరు. ధాన్యం అమ్మిన వారం రోజుల్లోనే పైసలు ఖాతాలో పడుతున్నయి. వానకాలంలో ఎకరంలో 60 సంచులు వడ్లు పండించిన. రూ.50 వేలు వచ్చినయి. అప్పటి రోజులతో చూస్తే.. కేసీఆర్ సారు పాలనలో రైతులమంతా చాలా సంతోషంగా ఉన్నాం.
– సూకూరి రాజయ్య, పోతారం, సిద్దిపేట జిల్లా
మిత్తీలు కట్టాల్సిన పనిలేదు

గతంలో పెట్టుబడి కోసం ఊర్లో ఉన్న షావుకారు వద్ద మిత్తికి తీసుకుని సాగు చేసేది. నాకు ఎకరంన్నర పొలం ఉన్నది. పంట పండితేనే ఇల్లు గడిచేది. ఒక్కోసారి కూలి పనులకూ పోయినం. వరి వేస్తే మిత్తికే సరిపోయేది. ఒక్కోసారి అప్పులయ్యేది. సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి కష్టాలు తీర్చిండు. ఇప్పుడు ధైర్యంగా సాగు చేస్తున్నం. ఎవరినీ చేయిచాచి అడగాల్సిన పనిలేదు. పొలాన్ని నాట్లు వేసేందుకు సిద్ధం చేస్తున్నా. ఏటా రైతుబంధు అందుతుండటంతో నా కష్టాలు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నది. వడ్లు కొనుగోలు కేంద్రానికి తీసుకుపోతే వెంటనే కొంటున్నారు. డబ్బులు కూడా బ్యాంకులో వేస్తున్నారు. దళారుల ప్రమేయం లేదు. తూకంలో మోసం లేదు. సంబురంగా సాగు చేస్తున్నం. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే మంచిగా వ్యవసాయం చేసుకోవచ్చు.
-అబ్దుల్ అలీం, రైతు తిప్పనపల్లి గ్రామం, చండ్రుగొండ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
బర్కత్ అస్తున్నది

నాకు ఎకరంన్నర వరకు పొలం ఉన్నది. నా ఖాతాలో రూ.6,900 జమ చేసిండ్రు. సర్కారోళ్లు పైసల్ ఎయ్యంగానే మెసేజ్ అచ్చింది. మావోళ్లు చూసి అవి రైతుబంధు పైసలేనని చెప్పిండ్రు. ఫోన్ చూసుకున్నంక జేబులో పైసలొచ్చినంత ఆనందమేస్తున్నది. గీ పైసలను పొలం పనులకే వాడుకుంటా. ఎరువులు, విత్తనాలు కొనుక్కుంటా. పొదుపుగా రైతుబంధు పైసల్ వాడుకుంటున్నం. రైతుల అవసరాలను గుర్తించే కేసీఆర్ సారూ ఈ పైసలేస్తుండు. గింత మంచిగా రైతులకు సాయం చేసినోళ్లను ఇప్పటివరకు సూడలేదు. రైతుబంధు పైసలతోటి నిజంగానే బాధలు పోయినయి. ఖర్చుల్లో చాలా ఆసరా అవుతున్నది.
-తోట పెద్ద సాయిలు, రైతు, పొతంగల్ గ్రామం, నవీపేట మండలం, నిజామాబాద్ జిల్లా
గ్రామాల్లో పండుగ కళ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ సార్ రైతుల పక్షపాతిగా నిలబడటంతో మళ్లీ వ్యవసాయానికి జీవం వచ్చింది. గ్రామాల్లో పంట పొలాల సాగు పెరుగుతూ వస్తున్నది. గతంలో భూగర్భ జలాలు అడుగంటి చుక్కనీరు రాని పరిస్థితి ఉండేది. పెద్ద సారు ప్రాజెక్టులను కట్టడంతోపాటు వానదేవుడు కరుణించాడు. మా గ్రామంతోపాటు మా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి చెరువులో నీరు చేరింది. ఎక్కడ బోరు వేసినా 40 ఫీట్లలోనే నీళ్లు పడుతున్నాయి. బీడు భూములన్నీ పచ్చగా మారాయి. సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
-బాలప్ప, రైతు, చిన్నజట్రం, నారాయణపేట జిల్లా
ఆయనను రైతులంతా కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి

సీఎం కేసీఆర్ మాలాంటి రైతుల పాలిట దేవుడు. ఆయన పాలనలో రైతుల ముఖాల్లో సంతోషం కనబడుతున్నది. నాకు 1.30 ఎకరాల పొలం ఉన్నది. వానకాలంలో వరి వేసిన. రైతుబంధు పైసల్ రూ.9 వేలు వస్తే యూరియా, డీఏపీ, గడ్డిమందులు కొన్నా. వానకాలంలో పైసలు ఎక్కువగా చేతికి రాలేదు. రైతుబంధు డబ్బులు నాకు ఆసరా అయ్యాయి. యాసంగిలో జొన్న, మొక్కజొన్న వేసిన. ఇప్పుడు వచ్చిన రైతుబంధు డబ్బులతో డీఏపీ, యూరియా కొంటా. రైతుబంధు ఇచ్చి కేసీఆర్ కొండంత ధైర్యం ఇస్తున్నడు. ఆయనను రైతులంతా కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి.
– జంగం అమృతప్ప, రైతు, చేర్యాల, సంగారెడ్డి జిల్లా
విత్తనాలు, మందులకు ఢోకా లేదు

నాకు గ్రామంలో ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉన్నది. తెలంగాణ రాక ముందు మాసోంటి చిన్న రైతులు వ్యవసాయం చేయాలంటే కష్టంగా ఉండేది. పంట పెట్టుబడులు ఉండక పోయేవి. అడా, ఈడా బాకీలు తెచ్చి పంటలు వేసేటోళ్లం. బాకీల కోసం నెల రోజులు తిరుగాల్సి వచ్చేది. పైసలు చేతిలో లేకపోవడంతో వానలు పడ్డప్పుడు విత్తనాలు వేసేటోళ్లం కాదు. దీంతో పంటలు సరిగా పండకపోయేవి. రైతుబంధు పథకం మా కష్టాలను దూరం చేసింది. వానకాలం, యాసంగి పంటలకు కలిపి రూ.15 వేలు వస్తున్నాయి. సర్కారు సాయంతో నాకు కావాల్సిన విత్తనాలు, మందు బస్తాలు ముందుగానే కొంటున్నా. పైసలు ఎట్లన్న వస్తాయనే నమ్మకంతో దుకాణం సేట్లు కూడా ప్రతి సీజన్‌కు విత్తనాలు ఇస్తున్నారు. వానకాలంలో పత్తి, యాసంగిలో శనగ సాగు చేస్తున్నా. అన్ని ఖర్చులు పోనూ రూ.90 వేలు మిగులుతున్నాయి.
– వోసా కాళిచరణ్, రైతు, అంకోలి, ఆదిలాబాద్ జిల్లా
కేసీఆర్ ఉంటే రైతుకు ఫికర్ ఉండదు

రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మంచి చేసిండు. మళ్లా కేసీఆరే వత్తడు. ఆయనే రావాలే. వేరే అతను వస్తే రైతుబంధు రాదు. నాకు ఎకరంన్నర పొలం ఉన్నది. ఇప్పుడు వచ్చిన పైసలు నాటుకు సరిపోతాయి. అప్పుకు పోకుండా పెట్టుబడి ఇస్తున్నడు. రైతుబంధు వచ్చిన నాటి నుంచి మా తండాలో భూములన్నీ పంటలతో పచ్చబడ్డాయి. మంచిగ బతుకుతున్నం. మాకు లిఫ్టు కూడా నిరంజన్‌రెడ్డి సారు తెచ్చిండు. ఇప్పుడు కరెంటుకు, నీటికి, పెట్టుబడికి గోస లేదు. కేసీఆర్ ఎప్పటికీ సీఎంగా ఉంటే రైతుకు ఫికర్ ఉండదు.
– తిరుపతి, కర్నెతండా, ఖిల్లాఘణపురం, వనపర్తి జిల్లా
ఆసాముల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి

రైతుబంధు చేయవట్టి షావుకార్ల చుట్టూ తిరిగే తిప్పలు తప్పాయి. నాకు రెండెకరాల భూమి ఉన్నది. ఏడాదికి రెండు పంటలు వేస్త. మునుపు షావుకార్ల దగ్గరికి పోయి, పంట పెట్టుబడికి బాకీ ఇయ్యమని అడుగుతుంటిమి. వాళ్లు వారం రోజులు తిప్పించుకొని ఇత్తె ఇచ్చేది, లేకుండా అందయని చెప్పేది. ఆళ్లు లేవంటే మల్లొక్కలను చూసుకొని ఆళ్ల చుట్టూ తిరిగేది. కొందరు షావుకార్లయితే మక్కలు మాకే అమ్మాలే. వడ్లు మాకే అమ్మాలే.. అంటూ తిరకాసులు పెట్టేది.. రైతుబంధు పుణ్యమా అని ఇప్పుడా బాధల్లేవు. టైంకు పైసలు బ్యాంకుల పడుతున్నయి. పెట్టుబడికి షావుకార్ల చుట్టూ తిరిగే తిప్పలు తప్పింది. రైతుబంధు, 24 గంటల కరెంట్, వడ్లు కొనడానికి ఊళ్లోనే ఐకేపీ సెంటర్ పెట్టినంక మా పరిస్థితి కొంచెం మంచిగైంది. నాలుగు పైసలు కండ్ల సూత్తున్నం. రైతుల కోసం మునుపు ఎవళ్లు ఇంత మంచిగ ఆలోచించలే. కేసీఆర్‌సార్ అచ్చినంక రైతులకు అన్ని మంచి పనులు చేస్తున్నడు. ఆయన కడుపు సల్లగుండాలని ఆ భగవంతుడిని మొక్కుకుంటున్నం.
-క్యాతం మల్లారెడ్డి, రైతు, రాంపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా
కేసీఆర్ సీఎంగా ఉండటం మా అదృష్టం

నాకు ఎకరం ఏడు గుంటల భూమి ఉన్నది. నా ఫోన్‌కు గురువారం పొద్దుగాల మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు పోతే.. రైతుబంధు కింద రూ.5,875 వచ్చినయని జెప్పిండ్రు. శానా సంతోషమనిపించింది. యాసంగి సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇగ ఎరువులు కొంట. నాట్లు వేసేందుకు ఐదు వేలు కావాలి. ఇప్పుడొచ్చిన రైతుబంధు డబ్బులతో రేపు నాట్లు వేసుకుంటాం. గతంలో నీళ్లు, ఎరువులు, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పంట పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయేవాళ్లం. అప్పులు చేయలేక సరిగా సాగు చేసేవాళ్లం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కష్టాలు తీరినయ్. సీఎం కేసీఆర్ పంట పెట్టుబడికి సాయం అందిస్తుండటంతో అప్పులు చేయడం లేదు. రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ సీఎంగా ఉండటం మా అదృష్టం.
-బోయ సతీశ్, కిష్టాపురం, మునుగోడు మండలం, నల్లగొండ జిల్లా
