హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం: భూమిలేని నిరుపేదలకు గతంలో సర్కారు ఇచ్చిన భూములకు రెక్కలొచ్చాయి. సాగు చేసుకొని జీవనం సాగిస్తారని సదుద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ధనదాహానికి అడ్డాగా మారాయి. నిబంధనలు అనుమతించకున్నా.. గుట్టుచప్పుడు కాకుండా పేదోళ్ల భూములు పెద్దోళ్లపరం అవుతున్నాయి.
ఒకటీ రెండు కాదు.. ఏకంగా 190 ఎకరాల లావణి పట్టా భూముల్ని చేజిక్కించుకొని పట్టా భూమిగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.570 కోట్ల విలువైన భూముల్ని అగ్గువకు చేజిక్కించుకొని రియల్ ప్రాజెక్టులతో రూ.వేల కోట్లు గడించేందుకు భారీ స్కెచ్ వేసిన ఒక కంపెనీ అనధికారికంగానే ఈ భూములను కొనుగోలు చేస్తున్నది. ఇదంతా అ ధికార యంత్రాంగానికి తెలిసినా ఎవరికి వారు ‘సంతృప్తి’గానే ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకోవటంతో రెవెన్యూ రికార్డుల్లో లావణి పట్టా భూములను సాధారణ పట్టా భూములకు మార్చేందుకు వేగంగా పావులు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ చేపట్టిన విచారణలో నకిలీ ఎన్వోసీని అడ్డుపెట్టుకొని కొందరు ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ భూములను కాపాడేందుకు రేవంత్ సర్కారు ఏం చర్యలు తీసుకుంటుంది?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి ఖానాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 79లో సుమారు 250 ఎకరాల భూమి ఉన్నది. 1953లో భూ గరిష్ట పరిమిత చట్టం అమలులోకి వచ్చింది. అప్పటికే ఖానాపూర్ గ్రామంలో జాగిర్దార్ ఉన్నారు. ఆయనకు ఖానాపూర్‌తో పాటు యాచారం మండలం చింతుల్లలో వందల ఎకరాల భూములు ఉన్నాయి. భూగరిష్ట చట్టం రావడంతో ఆయన పేరు మీద ఉన్న వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
ఖానాపూర్లోని సర్వే నంబర్ 79 లోని 250 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. ఇందులో 60 ఎకరాల భూమిని గ్రామ అవసరాలకు కేటాయించారు. మిగిలిన భూమిని గతంలో జాగిర్దారీ కోరిక మేరకు అప్పటి ప్రభుత్వం ఖానాపూర్‌కు చెందిన 26 మంది భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేసింది. ఒక్కొక్కరి పేరిట 7 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. దీంతో ఆ రైతుల పేరిట రెవిన్యూ రికార్డుల్లో లావణి పట్టా భూములుగానే నమోదవుతూ వస్తున్నది.
ప్రస్తుతం ధరణి రికార్డుల్లో కూడా సదరు 26 మంది రైతుల పేరిట ఈ భూములు లావణి పట్టాగా నమోదయ్యా యి. నిషేధిత జాబితాలోనూ ఈ సర్వే నంబర్ నమోదై ఉన్నది. అంటే ఈ భూములపై క్రయ, విక్రయాలు నిషేధం. అయితే ఈ భూములు హైదరాబాద్-నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారికి అతి సమీపంలో… ఫోర్త్ (ప్యూచర్ సిటీ) సిటీకి సైతం సమీపంలోనే ఉండటంతో కొందరి బడా వ్యక్తుల నజర్ ఈ భూములపై పడింది.
ప్రైవేటు సంస్థ పేరిట కొనుగోలు
ఈ భూములపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఆరాధ్య హోలిస్టిక్ ఎల్ఎల్పీ కంపెనీ పేరుతో కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. రైతులను నయానో.. భయానో.. నచ్చజెప్పి అనధికారిక ఒప్పందాలతో ఈ భూములను కొనుగోలు చేశారు. తొలుత 15 లక్షలతో మొదలైన ఈ కొనుగోలు ప్రక్రియ.. ఇప్పుడు ఏకంగా రూ.50 లక్షల వరకు చేరింది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ విచారణ చేపట్టగా.. 1950లోనే సర్వేనంబర్ 70లోని భూమిని జాగిర్దారీ భూమిగా ప్రకటించినట్టు తేలింది. ఈ మేరకు ఉర్దూలో ఉన్న ఆ ఒప్పంద ప్రతిని ఆంగ్లంలోకి కూడా అనువదించిన ప్రతి లభించింది.
‘సర్వే నంబర్ 70లోని లావణి ఖాస్రా పట్టా భూమిని 26 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖద్దం పట్వారీ సమక్షంలోనే పూర్తయింది. లేఖ నంబర్ 864, 865 తేది: 28.4.1953 ప్రకారం జమాబంధీ అమలు చేయడం జరిగింది. 1954లో ఆ 26 మంది ఆ భూముల్లో సేద్యం చేసి జొన్నపంట వేశారు. ఈ మేరకు జొన్న పండించినట్టు రికార్డుల్లో నమోదు చేయడం జరిగింది’ అని రెవెన్యూ పాత రికార్డుల్లో నమోదై ఉన్నది. కానీ కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఆ రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా భూములను కొనుగోలు చేశారు.
20-30 శాతం రేటుకే హస్తగతం
వాస్తవానికి ఖానాపూర్ గ్రామపరిధిలో పట్టా భూముల విలువ ఎకరా రూ.3 కోట్లకు పైగానే ఉన్నది. కానీ ఇవి లావణి పట్టా కావటంతో తమకు దక్కిందే చాలు అని రైతులు అనుకుంటున్నారు. ఈ క్రమంలో బాట సరిగాలేని భూ ముల రైతులు రూ.12-15 లక్షల వరకు ఎకరా భూమిని విక్రయించగా, కొంత బాట సరిగా, ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నవారు ఎకరా రూ.30-50 లక్షల వరకు విక్రయించారు.
ఈ మేరకు అనధికారికంగానే ఒప్పందాలు చేసుకున్నారు. లావణి పట్టా అయినందున అధికారికంగా రిజిస్ట్రేషన్ కాకపోవటంతో ప్రస్తుతానికి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా బాండు పేపర్లపై ఒప్పందం చేసుకొని, రైతుల పాసు పుస్తకాలను సదరు కంపెనీ స్వాధీనం చేసుకున్నది.
అసైన్డ్ భూముల కొనుగోళ్లకు రైతుల్లో ఒకరికి తెలియకుండా మరొకరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు రేట్లు నిర్ణయిస్తున్నారు. ముందుగా రైతుల ఆధార్ కార్డులను పాత పాస్‌బుక్‌లను తీసుకుని వారి నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ప్రమేయంతో కొంతమంది రైతులకు ఎక్కువ రేట్లు ఇవ్వగా, మరి కొంతమంది రైతులకు తక్కువ రేట్లు ఇచ్చారు. దీంతో రైతుల మధ్య ప్రస్తుతం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
హైడ్రా రంగంలోకి దిగుతుందా?
వాస్తవానికి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రేవంత్ ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైడ్రా చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న కట్టడాలను కూల్చివేసింది. అదీ ప్రధాన నగరంలోని వాటిపైనే దృష్టిసారించింది. కానీ నగరానికి అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలంలోని 190 ఎకరాల ప్రభుత్వ భూమి అనేది సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న ఫ్యూచర్ సిటీకి అతి సమీపంలో ఉన్నది.
అంటే భవిష్యత్తులో ఇది ప్రభుత్వానికి, ప్రజాప్రయోజనాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి.. రేవంత్ సర్కారు అనధికారికంగా జరిగిన ఈ విక్రయాలపై కొరడా ఝళిపించి సర్కా రు భూములను పరిరక్షిస్తుందా? అనేది ప్రశ్న. ముఖ్యంగా ఫోర్త్ సిటీ రానున్నందున ఇలాంటి అక్రమాలు ఇంకా ఎన్నో వెలుగుచూసే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో రేవంత్ సర్కారు చిత్తశుద్ధితో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు అడుగు ముందుకు వేస్తుందా? అనేది తేలాల్సి ఉన్నది.
రికార్డులన్నీ మాయం
ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన రికార్డులన్నీ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు ఒక మాజీ పట్వారీ ఇంట్లో వీటికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నట్టు తెలిసింది. వాస్తవానికి ఆది నుంచి లావణి పట్టాగానే రికార్డులు కొనసాగుతున్నప్పటికీ రెండు, మూడు సంవత్సరాల పాటు ఆర్వోఆర్లో పట్టా భూమిగా నమోదు చేశారు. దీని ఆధారంగానే ఇక ముందు ఆద్యంతం పట్టా భూమిగా రికార్డులను తారుమారు చేసేందుకు స్కెచ్ వేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే నకిలీ ఎన్వోసీని సృష్టించి, దాని ఆధారంగానే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్టు సమాచారం.
1953లో లావుని పట్టాలు పొందిన రైతులు
1. చింతకాయల రామయ్య
2. మాదాసు రామయ్య
3. పడకంటి జంగయ్య
4. మాల జంగయ్య
5. మాదాసు చిన్నయ్య
6. దొంతరమోని కనిగా
7. చేతాల లక్ష్మయ్య
8. జాషువా
9. పంది ఎల్లయ్య
10. పంది రాములు
11. పంది రాజయ్య
12. ముత్తయ్య
13. మల్లయ్య
14. కట్టెల మారయ్య
15. చింతకాయల పెద్ద అచ్చయ్య
16. కావలి దుర్గయ్య
17. వనం మల్లయ్య
18. యాదయ్య
19. కాళ్ల జంగయ్య
20. పుల్లయ్య
21. కిష్టయ్య
22. సత్తయ్య
23. మల్లయ్యతో పాటు మరో ముగ్గురు రైతులకు ప్రభుత్వం అసైన్డ్‌మెంట్ పట్టాలను ఇచ్చింది.