పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికార పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటుంది. మూడింట రెండు వంతుల గ్రామాలు అధికార పార్టీ ఖాతాలో పడిపోతాయి. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ సగానికి మించి పంచాయతీలను సాధించలేకపోయింది. అది కూడా.. ఏకగ్రీవాలకు ఒత్తిడి చేసి, ప్రత్యర్థులను బెదిరించి, భయపెట్టి, దాడులకు తెగబడి, అధికార యంత్రాంగాన్ని వాడుకుని, కోడ్‌ను ఉల్లంఘించి చేస్తే దక్కిన ఫలితం.
తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకీ భంగపాటు? ఊరు ఎందుకు ఉరుముతున్నది? హామీల ఎగవేత, ఆగిన సంక్షేమ పథకాలు, కానరాని అభివృద్ధి పనులు, రోడ్డెక్కుతున్న వివిధ వర్గాలు, రగిలిపోతున్న రైతు కుటుంబాలు, దగా పడ్డామని నమ్ముతున్న సబ్బండవర్ణాలు.. అన్నీ కాంగ్రెస్‌ను తరుముతున్నాయి. అందుకే, నిన్నటిదాకా నిలదీతలతో ఆగ్రహాన్ని ప్రకటించిన పల్లెలు.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తమ ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. మాటతప్పిన కాంగ్రెస్‌పై మోకా చూసి కొరడా ఝుళిపిస్తున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 12 (డిసెంబర్): తెలంగాణ (Telangana) పల్లెలు చైతన్యం ప్రదర్శించాయి. అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశాయి. రెండేండ్ల క్రితం ఆరు గ్యారెంటీల పేరిట ఆశ పెట్టి గద్దెనక్కిన కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) చేసిన మోసంపై రగిలిపోతున్న గ్రామీణ ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) తామేంటో రుచిచూపించారు. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో భారీ సభలు నిర్వహించినా, ఓట్లేయాలని వేడుకున్నా ఓటర్లు పట్టించుకోలేదు. జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసినా.. వేధింపులకు పాల్పడినా.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు దిగినా తెలంగాణ ప్రజలు బెదరలేదు.
హత్యా రాజకీయాలను కూడా తిప్పికొట్టారు. గ్రామ పంచాయతీలకు గురువారం నిర్వహించిన తొలి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో సుమారు 14 వందల మంది సర్పంచ్‌లు, వేలాది మంది వార్డు సభ్యులు గెలుపొందారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మద్దతు ఇచ్చినవారు ఈ స్థాయిలో గెలువడం ఒక రికార్డు! అధికారం లేకపోయినా, డబ్బులు పంపిణీ చేయకపోయినా, అగ్రనేతలెవ్వరూ ప్రచారం చేయకపోయినా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతు ఉన్న సర్పంచ్‌లు విజయఢంకా మోగించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను మెజారిటీ పంచాయతీల్లో గెలిపించడం ద్వారా ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్న పల్లెల దృఢ సంకల్పం స్పష్టంగా వ్యక్తమైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనే ఈ స్థాయిలో షాక్ ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు ఊహించలేదు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్చినవారే గెలుస్తుంటారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2/3వ వంతు మందికిపైగా బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌లు గెలిచారు. కానీ, ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కనీసం 50% స్థానాల్లోనైనా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందకపోవడం గమనార్హం.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై గ్రామీణ ప్రజల్లో ఉన్న స్పష్టమైన వ్యతిరేకతకు నిదర్శనమని భావిస్తున్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయడంలేదు. రేవంత్‌రెడ్డి సర్కార్ రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ మభ్యపెట్టి, చివరకు పిల్లిమొగ్గలు వేసిన తీరును రైతులు గమనించారు. ఇప్పటికీ ఇంకా రాష్ట్రంలోని 16 లక్షలకుపైగా రైతులకు రుణమాఫీ కాలేదు.
బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత రెండుసార్లు అసలుకే ఎగనామం పెట్టిన విషయాన్ని, రూ.12 వేలకే పరిమితం చేసిన వైనాన్ని రైతులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఎన్నికల సరళి స్పష్టం చేస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎరువులు, విత్తనాల కొరతతో గోసపెట్టిన ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకున్నట్టు ఓట్లేశారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన సర్కార్.. గత యాసంగికి బోనస్ ఎగ్గొట్టింది.
రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది రైతులకు బోనస్ కింద ఇవ్వాల్సిన రూ.1,160 కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టిందన్న భావన రైతుల్లో ఉన్నది. దీనిపై రైతులు తమ నిరసన ఓట్ల రూపంలో వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.పది లక్షలు ఇస్తామని చెప్పి నయాపైసా ఇవ్వకుండా మాట తప్పిన పార్టీకి ఓటుతో బుద్ధిచెప్పారు. ఒక్క రైతులే కాదు.. మహిళలు కూడా తమకు ఇస్తామన్న రూ.2,500 ఎగ్గొట్టిన విషయాన్ని గుర్తుచేసుకొని మరీ ఓట్లు వేసినట్టు ఎన్నికల ఫలితాల సరళి వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ చీరల పేరుతో పంచాయతీ ఎన్నికల ముందే ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు.
ఇది కూడా బెడిసికొట్టింది. గ్రామాల్లో ఇందిరమ్మ చీరలు సగానికిపైగా మహిళలకు అందలేదు. అందినచోట్ల కూడా ఎన్నికల తాయిలాలుగానే వీటిని చూశారు. రెండేండ్లుగా ఒక్క చీర కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. పంచాయతీ ఎన్నికల ముందు చీరల పంపిణీని తూతూమంత్రంగా మొదలు పెట్టిందని మహిళా లోకం భగ్గుమంటున్నది. ఇది తమను అవమానించడమేనని భావించింది. గ్యాస్ సబ్సిడీ విషయంలోనూ రేవంత్ సర్కార్ తమను మోసం చేస్తున్నదన్న భావన మహిళల్లో వ్యక్తమవుతున్నది. గత ఆరు నెలలుగా క్రమంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నది. ఇస్తామన్న సబ్సిడీని ఇవ్వడంలేదు.
అర్హుల జాబితా చిక్కిపోతున్నది. పథకం ప్రారంభించినప్పుడు 58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో సగం మందికి కూడా పథకం అందడంలేదు. సుమారు 30 లక్షల మందికిపైగా మహిళల పేర్లపై ఉన్న కనెక్షన్లకు సబ్సిడీ రావడంలేదు. ఇక కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ గప్పాలు కొట్టారు. కోటి కాదు కదా.. కనీసం ఒక్కరిని కూడా కనీసం లక్షాధికారిగా కూడా చేయలేదని మహిళా సంఘాలే ఆరోపిస్తున్నాయి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో భాగంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వకపోవడం, వీటన్నింటి ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది. ఇక పెన్షన్లు రూ.నాలుగు వేలకు పెంచకపోవడం, ఇందిరమ్మ ఇండ్లకు దళారులను పెట్టి డబ్బులు వసూలు చేయడం, ఇలా ఒకటేమిటి.. వందల సంఖ్యలో కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలు గుర్తుచేస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేనివిధంగా ఈసారి హత్యా రాజకీయాలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది. తుంగతుర్తి నియోజకవర్గంతోపాటు సూర్యాపేట జిల్లాలో పలు హింసాత్మక ఘటనలకు కాంగ్రెస్ అనుకూల వర్గాలు పాల్పడ్డాయి. అయినప్పటికీ, బీఆర్ఎస్ అభ్యర్థులను లొంగదీసుకోలేకపోయారు. ములుగు వంటి నియోజకవర్గంలో అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. మరికొన్నిచోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఎక్కడా బీఆర్ఎస్ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. 14 వందల పంచాయతీలను ప్రతిపక్షంలో ఉండి కైవసం చేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ కుటుంబసభ్యులను నిలబెట్టారు. అనేకచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు ఓడిపోయారు. ఉదాహరణకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత వదిన ఓడిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఎంపీలు, ముఖ్యనేతల సొంత గ్రామాల్లో వారు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. ఇది చెంపపెట్టులాంటిది. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనేకచోట్ల ప్రజలు ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీశారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేవలం పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రతి సభలో, సమావేశంలో సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటెయ్యాలంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడూ ముఖ్యమంత్రులు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేయలేదు. కానీ, రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని ప్రజలు పట్టించుకోలేదని అర్థమవుతున్నది. రాబోయే రెండు విడతల్లో కూడా ఇదే తరహా ఫలితాలు వస్తాయని, ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మూడేండ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, తాము ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతుతో పోటీచేసి గెలిస్తే ఐదేండ్లు అధికారంలో ఉంటామని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గ్రామాలను తప్పకుండా అభివృద్ధి చేసుకుంటామని సర్పంచ్ అభ్యర్థులు చెప్తున్నారు.

‘కాంగ్రెస్‌కు అభ్యర్థుల్లేక.. కేసీఆర్ ప్రభుత్వంలో బీసీబంధు తీసుకున్న మహిళను పోటీ చేయిస్తున్నారు! పదవుల కోసం పార్టీ మారిన నువ్వు కూడా నీతులు చెప్తావా?’ అంటూ మంత్రి జూపల్లిని నిలదీశారు నాగర్‌కర్నూల్ జిల్లా గోప్లాపురం వాసులు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయనను అడ్డుకున్నారు. ‘గోబ్యాక్’ నినాదాల మధ్య జూపల్లి అక్కడినుంచి వెళ్లిపోయారు.

తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంపై ఓ యువకుడు సంబురాలు చేసుకున్నాడు. తాను కోరినట్టే మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో కాంగ్రెస్ ఓడిపోయి, బీఆర్ఎస్ గెలిచినందుకు హర్షం వ్యక్తంచేస్తూ పూదరి శ్రీనివాస్ తన మొక్కు చెల్లించుకున్నాడు. ముల్కల్ల గోదావరి పుష్కరఘాట్‌కు శుక్రవారం ఉదయాన్నే చేరుకుని గంగమ్మ ఆలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టాడు.

‘మా ఓట్లు కావాలి కానీ, మా సమస్యలు పట్టవా? తండాకు మంజూరైన సీసీ రోడ్డును రద్దు ఎందుకు రద్దు చేశారు? అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనయ్?’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును జుక్కల్ మండలం బేగంపూర్ తండావాసులు నిలదీశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనను అడ్డుకుని వెనక్కి పంపారు.


