కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నుంచి ఎలాగందల్ గ్రామాల మధ్య రూ. 90 కోట్లతో నిర్మిస్తున్న బీటీ, బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు కరీంనగర్ జిల్లా అభివృద్ధిని పట్టించుకోక అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఎలగందల్ ప్రజల చిరకాల కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని పేర్కొన్నారు.
రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఖిల్లా చరిత్రను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తెలంగాణలో సంపదను దోచుకునేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు కన్నేశారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రజలు ఆనందంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.