హైదరాబాద్, ఏప్రిల్ 20 ( నమస్తే తెలంగాణ ) : గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకం అమల్లో జవాబుదారీతనం లోపిస్తున్నది. గ్రామాల్లో వసతుల కల్పనకు, వ్యవసాయ తోడ్పాటుకు, రైతులకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఏటేటా ఫిర్యాదులు (పేరాలు) పెరుగుతున్నాయి. ఏదైనా సమస్యను పరిష్కరించడంతోపాటు అది పునరావృతం కాకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం.. పట్టించుకోకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) పథకం అమలులో అధికారుల జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తున్నది. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఏటా దేశవ్యాప్తంగా థర్డ్‌పార్టీ ద్వారా సోషల్ ఆడిట్ జరుగుతున్నది. క్షేత్రస్థాయిలో ఆడిట్ అధికారుల పరిశీలనకు వచ్చిన అంశాలు, సమస్యలు, పేరాలను డెసిషన్ టేకెన్ రిపోర్టు (డీటీఆర్)లో వెల్లడిస్తారు. డీటీఆర్ నివేదిక ఆధారంగా అధికార యంత్రాంగం యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) తయారు చేస్తున్నది. అయితే, రెండేండ్ల ఏటీఆర్ నివేదికలను పరిశీలిస్తే పేరాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిధుల దుర్వినియోగం కూడా అదేస్థాయిలో అధికమవుతున్నది. ఇది అధికారుల జవాబుదారితనాన్ని శంకిస్తున్నది.
ఉపాధిహామీ పథకం పనుల్లో అవినీతిని నిర్మూలించేందుకు, పారదర్శకత, జవాబుదారితం పెంచేందుకు ఏటా ర్యాండమ్‌గా గ్రామాల్లో థర్డ్ పార్టీ సంస్థలతో ఆడిట్ నిర్వహిస్తారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నాలుగు విభాగాలుగా గ్రీవెన్సెస్ (ఫిర్యాదులు), ప్రొసెస్ వాయిలేషన్ (నిబంధనల ఉల్లంఘన), ఫైనాన్షియల్ డీవియేషన్ (పనుల కొలతల్లో తేడాలు), ఫైనాన్షియల్ మిస్ అప్రోపియేషన్ (నిధుల దుర్వినియోగం)పై స్వీకరిస్తారు. వీటిని పేరాలుగా పేర్కొంటారు. మొత్తం పేరాల నివేదికను ప్రభుత్వ యంత్రాంగానికి డెసిషన్ టేకెన్ రిపోర్టు (డీటీఆర్) రూపంలో అందజేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,12,771 పేరాలు అందగా, వీటిలో కేవలం 5,837 పరిష్కరించారు. అంటే 1.87% మాత్రమే క్లోజ్చేశారు. ఏటేటా పేరాలు తగ్గకపోగా, పెరగడం గమనార్హం.