హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ‘వానమ్మ.. వానమ్మ… ఒక్కసారన్న వచ్చిపోవే…’ అంటూ గ్రామీణ ప్రాంతాలు వర్షాల కోసం వేయి కండ్లతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన జూన్‌లో వర్షాలు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రతిరోజూ రైతులు మేఘాల వైపు దీనంగా చూస్తున్నారు. వానదేవుడు ఎప్పుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మే ఆఖరులోనే మురిపించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా నెమ్మదించడంతో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది.
జూన్‌లో ఇప్పటివరకు (23వ తేదీ) సాధారణ వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా, 56.3 మీల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 42% లోటు వర్ష్షపాతం నమోదైంది. నిరుడు జూన్‌తో పోల్చితే ప్రస్తుత పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. నిరుడు జూన్‌లో ఇదే రోజు వరకు 114.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం జూన్‌తో పోల్చితే ప్రస్తుతం 51% లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం.
ఈ నెలలో ఇప్పటివరకు మూడు జిల్లాల్లో (మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్) మాత్రమే సాధారణం కంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మిగిలిన 30 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో 18 జిల్లాల్లో లోటు వర్ష్షపాతం, మరో 12 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. 226 మండలాల్లో లోటు వర్షపాతం, 236 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.