Runa Mafi | జనగామ, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలో ఇద్దరు రైతులకే రుణమాఫీ అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 554 మంది రైతులకు రూ.2.55 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా కేవలం ఇద్దరి ఖాతాల్లో రూ.87 వేలు జమ అయ్యాయి. పాత అప్పు పూర్తిగా చెల్లించినా, ఇంకా బకాయి ఉన్నట్టు రికార్డుల్లో చూపడంతో 552 మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. నిడిగొండ పీఏసీఎస్ సీఈవో నిర్వాకం, అధికారుల పర్యవేక్షణ లోపంతో 552 మంది రైతులు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. నిడిగొండ పీఏసీఎస్ పరిధిలో 3,760 మంది రైతులు సభ్యులుగా ఉండగా, అందులో కొందరు రైతులు రుణం తీసుకొని చెల్లించినప్పటికీ బాకీ ఉన్నట్టు, మరి కొందరు అప్పు తీసుకోకపోయినా వారి పేరిట బాకీ ఉన్నట్టు సీఈవో తప్పుడు రికార్డులు సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్ పాలకవర్గం, సీఈవో కుమ్మక్కై తప్పుడు రికార్డులు సృష్టించి రూ.లక్షలు స్వాహా చేయడంతో పలువురు రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. దీంతో రైతులు పాలకవర్గంతోపాటు సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిడిగొండ గ్రామానికి చెందిన వూరడి చంద్రమౌళి ఆధార్‌కార్డు నంబరుపై ఆయనతోపాటు మరొకరికి రూ.10 వేలు రుణం ఇచ్చినట్టు పీఏసీఎస్ రికార్డుల్లో ఉన్నది. పదేండ్ల క్రితమే అతడు అప్పు మొత్తం చెల్లించి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకొని గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకులో రూ.1.60 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇద్దరికి ఒకే ఆధార్ నంబర్ ఉండటంతో ప్రస్తుతం అతడి పంటరుణం మాఫీ కాలేదు.
రైతుల పేరిట ఫోర్జరీ సంతకాలు చేసి లక్షలు దండుకున్న పీఏసీఎస్ సీఈవో రాజయ్య నుంచి డబ్బులు రికవరీ చేయాలి. సీఈవో అక్రమాలకు తెరలేపాడు. సాంకేతికంగా రుణమాఫీ వర్తించకుండా నష్టం చేశాడు. సీఈవోపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు చేస్తాం.
మాఫీకి అర్హత ఉన్నా, పీఏసీఎస్‌లో అప్పు తీసుకోకున్నా తీసుకున్నట్టు రికార్డుల్లో చూపించడంతో నాకు మాఫీ వర్తించలేదు. రైతుల పేరిట దొంగ సంతకాలు పెట్టి అప్పు ఇచ్చిన్నట్టు రికార్డులు సృష్టించిన సీఈవో రూ.కోట్లు దండుకున్నాడు. ప్రభుత్వం స్పందించి సీఈవోపై చర్యలు తీసుకోవాలి. రైతులకు బేషరతుగా మాఫీ చేయాలి.