హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌తోపాటు ఢిల్లీ పెద్దలకు కూడా ‘నంబర్ 2’ మంత్రి గుబులు పట్టుకున్నదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆయనతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోవడం ఎంతవరకు సురక్షితం అనే చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో తెలియదా? దాని మోచేతి నీళ్లు తాగినోళ్లు..’ అంటూ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైనట్టు సమాచారం. పార్టీ ఫండ్ కింద కేవలం రూ.కోటి ఇచ్చి, ‘మోచేతి నీళ్లు తాగినోళ్లు’ అని మాట్లాడారంటే.. రూ.కోట్ల కొద్దీ మూటలు తీసుకుంటున్న ఢిల్లీ అధిష్ఠానం పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తిపోతున్నారట.
ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినట్టు, సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి మరో పార్టీలోకి మారితే పరిస్థితి ఎలా ఉంటుందని అంతర్మథనం మొదలైనట్టు చెప్తున్నారు. ఢిల్లీకి పంపిన మూటలు, మహారాష్ట్ర, బీహార్, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు చేసిన సర్దుబాట్ల గురించి ఒక్కొక్కటిగా గుట్టు విప్పుకొంటూ పోతే ‘బడేభాయ్’కి అడ్డంగా దొరికిపోతామని కాంగ్రెస్ పెద్దలు ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.
ఢిల్లీకి పంపుతున్న మూటల్లో 90% వాటా తనదే అని, ముఖ్యనేత కేవలం 10 శాతమే సమకూర్చుతారని నంబర్ 2 మంత్రి ఏకంగా ఏఐసీసీ ప్రధాన బాధ్యతలు చూసే నేతకే చెప్పినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉన్నది. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీలోని ముగ్గురు కీలక నేతలను కలిసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా ఆర్థిక వ్యవహారాలు చూసే నేతను కలిశారని సమాచారం. తెలంగాణలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలను ఆయనకు పూసగుచ్చినట్టు చెప్పారని తెలిసింది.
తెలంగాణ నుంచి ఇద్దరమే ఢిల్లీకి సర్దుబాటు చేస్తున్నామని, మిగతా వాళ్లంతా కేవలం పదవులు అనుభవించే వారేనని వివరించినట్టు సమాచారం. ఈ డబ్బులో కూడా 90% తానే సర్దుతున్నానని, మిగతా 10% ముఖ్యనేత అనుచరులు కొందరు సర్దుబాటు చేస్తారని చెప్పినట్టు తెలిసింది. మహారాష్ట్ర, బీహార్, కేరళ, ఢిల్లీకి పంపిన ప్రతి మూటలో మేజర్ వాటా తనదే అని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. ఆయన మాటలకు సదరు ఏఐసీసీ నేత పొంగిపోయి, ప్రధాన నేత, అగ్రనేతల వద్దకు తీసుకుపోయి పరిచయం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలోనే ‘రాష్ట్రంలో నంబర్ 2 నేత ఎవ రు?’ అని పార్టీలో అంతర్గతంగా చర్చకు వచ్చినప్పుడు పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడింది, నిలబడుతున్నది తానేనని నంబర్ 2 నేత స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 35 మందికి ఫండింగ్ ఇచ్చానని, ‘వాళ్లంతా నన్ను కాదని మీ వెంట ఉంటారా?’ అని ఎదురు ప్రశ్నించినట్టు చెప్తున్నారు. తాను మూటలు సర్దుబాటు చేశాను కాబట్టే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు వచ్చాయని, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో క్లీన్‌స్వీప్ చేయగలిగామని చెప్పినట్టు సమాచారం.
‘నా మీద ఈడీ దాడులు జరుగుతున్న విషయం మీరు చూస్తలేరా? బీఆర్ఎస్, బీజేపీ కలిసే నన్ను టార్గెట్ చేశాయి. నేను పొరుగు రాష్ర్టాల్లో ఎన్నికలకు కూడా ఆర్థిక సహకారం అందిస్తున్నాను కాబట్టే కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి’ అని అన్నట్టు తెలిసింది. పార్టీకోసం కష్టపడుతున్న తానే నంబర్ 2 అని సహచర మంత్రివర్గం ముందే తెగేసి చెప్పినట్టు అప్పట్లో చర్చ కూడా జరిగింది.
తాజాగా సదరు మంత్రి ఆర్థిక వ్యవహారా లు, ఆస్తుల చిట్టా మీద పార్టీలో చర్చ జరుగుతున్నదట. తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి 2014లో లోక్‌సభకు పోటీ చేసినప్పుడు ఆయనకున్న ఆస్తులు ఎన్ని? ఇప్పుడున్నవి ఎంత? నగదు ఎంత? అని వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. 2014లో లోక్‌సభకు పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరిట రూ.1.14 కోట్లు , భార్య పేరు మీద రూ. 3.17 కోట్లు కలిపి మొత్తంగా రూ 4.31 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద రూ 34.44 కోట్లు, తన భార్య పేరు మీద రూ.364.51 కోట్లు మొత్తం కలిపి రూ.395.95 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు.
కేవలం 9 ఏండ్లలోనే ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయని ‘ఎవరి మోచేతి నీళ్లు తాగి సంపాదించారు?’ అనేది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారట. రాష్ర్టానికి మంత్రి అయిన ఏడాది కాలంలోనే ఆయన కుమారుడు రూ.1,500 కోట్ల క్లబ్లో మెంబర్‌గా చేరినట్టు కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా పేరు పొందిన ఒక కన్స్ట్రక్షన్స్ కంపెనీని టేకోవర్ చేసినట్టు సమాచారం. ఇంత భారీగా సంపాదన ఉన్నది కాబట్టే అందరినీ బుట్టలో వేసుకొని ఆడిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా ఆయన గుట్టు బయట పడుతుండటంతో, ఎప్పుడు ఎవరి పుట్టి ముంచుతాడోనని కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టినట్టు సమాచారం.