హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని, స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న రౌడీషీటర్లు పోలింగ్ పోలింగ్ స్టేషన్ల వద్ద తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నికల అధికారులు డ్రోన్లతో కట్టుదిట్టంగా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించినప్పటికీ క్షేత్రస్థాయిలో పలుచోట్ల పోలింగ్ బూత్‌ల వద్ద జరిగిన ఘటనలను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా 144 సెక్షన్ అమలు కాలేదు.
ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమయంలో స్థానికేతరులు ఉండరాదంటూ ఎన్నికల సంఘం హెచ్చరించింది. కానీ ఈ నిబంధనను సాక్షాత్తు కాంగ్రెస్ నేతలే ఉల్లంఘించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా తిరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సిద్ధార్థనగర్‌లో కాన్వాయ్‌తో వెళ్లడం, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రాంచంద్రనాయక్, రాందాస్, చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ మల్లురవి, కాంగ్రెస్ నేతలు రోహిన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తదితరులు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేశారు. బీర్ల ఐలయ్య ఏకంగా పోలింగ్ బూత్ వద్ద లిస్ట్ పట్టుకుని కూర్చుని ఓటర్లను పిలిచి మాట్లాడడంపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదుచేసిన పోలీసులు మిగతా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చాలాచోట్ల స్లిప్పులతో పాటు డబ్బుల పంపిణీ, దొంగ ఓట్లకు సంబంధించి ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఇచ్చినా ఎక్కడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కొన్నిచోట్ల ఓటర్లు తమ ఓటు వేరొకరు వేశారంటూ పీవోలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కు లేదని ఓటర్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డివిజన్లలో తిరుగుతుంటే పోలీసులు వారికి భద్రత కల్పిస్తూ సహకరించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెప్పాల్సిన అధికారులు వారికి ఓటింగ్ సరళిని వివరించారు. ఇక నల్లగొండకు చెందిన ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ తాను ఇక్కడే ఉంటానంటూ మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.
షేక్‌పేట డివిజన్ బూత్ నంబర్ 67లో తమ ఓటు వేరొకరు వేశారంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి స్పందన లేదని ఓ మహిళా ఓటర్ భర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్ గుర్తింపు కార్డులు చూడకుండా ఓటు వేయడానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఓటులేని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ బాజాప్తాగా నియోజకవర్గంలో తిరగ్గా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మాత్రం పోలింగ్ బూత్‌లలోకి పోనీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎక్కడా 144 సెక్షన్ అమలు కాకపోవడం గమనార్హం. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు తూతూమంత్రంగా వ్యవహరించారే తప్ప అరాచకాలకు పాల్పడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను బెదిరించిన కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు. ప్రధానంగా 90కి పైగా సున్నిత ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఈ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిపించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ముందుగా చెప్పారు. కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
గతానికి భిన్నంగా నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంతగా దొంగ ఓట్లు, డబ్బుల పంపిణీ, రిగ్గింగ్ వంటి ఎన్నికల వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసులు చేతులెత్తేశారు. తమకెందుకు వచ్చిన గొడవ అంటూ తూతూమంత్రంగా బెదిరించి తప్పుకున్నారు. దీంతో తమకు పోలీసులు, అధికారుల అండ ఉండగా ఎవరేం చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు, కొందరు రౌడీషీటర్లు దొంగ ఓట్లు వేయించడంతో పాటు ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్దే స్లిప్పులతోపాటు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తుంటే పోలీసులు అక్కడే ఉండికూడా ఏం చేయలేదంటూ పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున డ్రోన్లను వినియోగిస్తున్నామంటూ బాకా ఊదుకున్న ఎన్నికల కమిషన్ ఉల్లంఘనల కదలికలను గుర్తించలేకపోయిందంటే ఆ డ్రోన్ల వ్యవహారమేంటో అధికార పార్టీకే తెలియాలని ఓటర్లు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికలో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను నిర్ధారించేందుకు, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి 139 డ్రోన్లను 407 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రయోగించారు. అయితే వాడవాడలా పోలింగ్ బూత్‌ల వద్ద జరిగే వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాల్సిన డ్రోన్లు ఈ ఉల్లంఘనలు బయటపెడ్తాయనుకుంటే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా అధికార పార్టీకి కొమ్ముకాశారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ వారు చేసే ఉల్లంఘనలను సమర్థిస్తూ, దొంగ ఓట్లను, డబ్బుల పంపిణీని కూడా చూసీచూడనట్టుగా వదిలేయడంతో ప్రతీచోటా వివాదం తలెత్తింది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరైనా గట్టిగా అడిగితే వారిపై ఉల్టా కేసులు బనాయించారు. కృష్ణానగర్‌లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లను బీఆర్ఎస్ నాయకులు పట్టుకుంటే, పోలీసులు తిరిగి వారినే బెదిరించారు.
బూత్ నంబర్ 22 వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసినా, వారిని బెదిరించినా పోలీసులు అసలు పట్టించుకోలేదని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పారు. చాలాచోట్ల దాడులు జరిగాయని, తమను బెదిరించి ఓటర్ల లిస్ట్ గుంజుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తామేం చేయలేమని చెప్పి చేతులెత్తేశారు. చిన్నశ్రీశైలంయాదవ్తోపాటు పలువురు రౌడీషీటర్లను బైండోవర్ చేసిన పోలీసులు ఎన్నికల సమయంలో వారి కదలికలపై నిఘా ఉంచాల్సింది పోయి బూత్‌ల దగ్గర తిరుగుతుంటే వారికి వత్తాసు పలుకుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి.