ఖమ్మం, నవంబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీసీఐ విధిస్తున్న రోజుకో తీరు నిబంధన పత్తి రైతును ఆగం చేస్తున్నది. తేమ శాతం 12కి మించితే కొనేది లేదంటూ వాపస్ పంపుతున్నది. ఈ విషయం తెలియని రైతులు ఎంతోదూరం నుంచి కష్టపడి పంటను తీసుకొచ్చి ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేట్‌లో అమ్ముకుందామన్నా వ్యాపారులంతా సిండికేట్‌గా మారి మద్దతు ధర కన్నా క్వింటాల్‌కు రూ.2వేలు తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఖమ్మం జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నా కలెక్టర్ ఇప్పటికీ పర్యవేక్షించకపోవడంతో పత్తి రైతుకు కన్నీరే మిగులుతున్నది.
తేమ శాతం లేక ఇంటిబాట
సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించేందుకు వచ్చిన రైతులు అధికారులు పెట్టే నిబంధనలు రైతులను కుంగదీస్తున్నాయి. మొదట్లో 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ఆ తర్వాత కొద్దిరోజులకే ఎకరాకు 7 క్వింటాళ్లకు పరిమితం చేసింది. సీసీఐ 8నుంచి 12శాతం తేమ నిబంధనతో క్వింటాకు రూ.7,800 నుంచి రూ.8,110 కాగా, అధిక వర్షాలతో తేమ శాతం ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని మరీ వచ్చిన రైతులు తేమశాతం తక్కువ ఉందనే సాకుతో వెనక్కి పంపేయడంతో రైతులు నిరాశతో ఇంటిబాట పడుతున్నారు. కొందరు రైతులు తిరిగి ఇంటికి వెళ్తే ఖర్చులు మరింత పెరుగుతాయనే ఆలోచన చేసి, ఖర్చులను భరించే స్తోమత లేక జిన్నింగ్ మిల్లుల్లోని షెడ్లల్లో పట్టాలు పత్తిని ఆరబోసుకుంటున్నారు. ఎన్నిరోజులైనా అక్కడి ఉండి సీసీఐకి అనుగుణంగా తేమశాతం చూపించినప్పుడు తిరిగి అమ్ముకుంటున్నారు.
ప్రైవేటులో అమ్ముకునేందుకు ఆసక్తి
సీసీఐ నిబంధనలతో అన్నదాతలు అగ్గువకైనా ప్రైవేటుకే అమ్ముకునేందుకు ఇష్టపడుతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో దళారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుండటంతో వారి దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. తేమ శాతంతో వెళ్లి పత్తిని సీసీఐకి అమ్ముకోవాలని, ఖమ్మం మార్కెట్‌కు తీసుకొచ్చి ప్రైవేటుకు అమ్ముకుని నష్టపోవద్దని రైతులకు అవగాహన కల్పించాలి. అధికారులు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. ప్రైవే టు వ్యాపారుల కోసమే మార్కెట్ అనేలా వ్యవహరిస్తున్నారు. కమీషన్ వ్యాపారులు నిత్యం రైతులకు ఫోన్లు చేసి పత్తిని విక్రయించేందుకు ఖమ్మం మార్కెట్‌కే తీసుకురండి, ధర నిర్ణయించిన వెంటనే కాంటాలు వేసి క్యాష్ ఇస్తామంటూ రప్పించుకోవడం కనిపిస్తోంది. ప్రైవేటు ద్వారా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పత్తి అమ్మకానికి వస్తున్నట్లు స్పష్టమవుతున్నది. దీన్ని అధికారులు ప్రోత్సహించి ప్రైవేటునే ప్రోత్సహిస్తుండటం గమనార్హం.