RTI | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తేతెలంగాణ): ‘రాష్ట్రంలో ప్రజలకు సమాచార ‘హక్కు’ ఉన్నట్టా? లేనట్టా?’ ఆర్టీఐ కమిషన్ కార్యాలయానికి రోజుల తరబడి వచ్చిపోయేవారి ప్రశ్న ఇది. 22 నెలలుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్, కమిషనర్ పోస్టులు భర్తీకాలేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది దాటినా నియామకాలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సమాచార హక్కు కమిషన్ ఏర్పాటు విషయంలో న్యాయస్థానాల తీర్పులను సైతం కాంగ్రెస్ సర్కార్ పక్కనపెట్టింది. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి నెలలు గడిచినా అడుగు ముందుకు పడటమే లేదు. సమాచార హక్కు కమిషనరేట్‌లో ఏ ఒక్క కమిషనర్ లేక దరఖాస్తులు పేరుకుపోతుండగా, అర్జీదారులు ఆర్టీఐ ఆఫీసు చుట్టూ తిరిగి ఉత్తచేతులతో మళ్లిపోతున్నారు. నాడు ప్రతిపక్షంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ఆర్టీఐ యాక్ట్‌పై గంభీర ప్రకటనలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎం అయి ఏడాది గడిచినా అదే సమాచార హక్కు కమిషనర్ల నియామకాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని సామాన్యుడు సైతం ప్రశ్నిస్తున్నాడు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన కమిషనర్‌తోపాటు కమిషనర్లను నియమిస్తామంటూ రేవంత్‌రెడ్డి చేసిన హామీలు ఏమయ్యాయయని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇదేనా ప్రజాపాలన?
కమిషనర్ల పదవీకాలం 2023 ఫిబ్రవరి 24న ముగిసింది. 22 నెలలుగా సమాచార హక్కు ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నది. కమిషనర్లు లేక దాదాపు 20 వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర సమాచార కమిషనర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారికి ‘మా చేతుల్లో ఏమున్నది?’ అన్న సమధానం ఆర్టీఐ కమిషనరేట్ సిబ్బంది నుంచి ఎదురవుతున్నది. దీంతో ఇదేనా ప్రజాపాలన? అని అర్జీదారులు నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు.
ఏడు పదవుల కోసం 750 మంది పోటీ
హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ఆదేశించిన ఫలితంగా రాష్ట్రంలో ఆర్టీఐ కమిషన్ ఏర్పాటుకు జూన్ 12న నోటిఫికేషన్ జారీచేసింది. అదేనెల 29 వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. సుమారు 400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలైలో జారీచేయగా 350 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పాత, కొత్త దరఖాస్తులన్నీ కలిపి 750 మందికి పైచిలుకు ప్రధాన కమిషనర్, ఆరు కమిషనర్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో సుమారు 55 మందికిపైగా రిటైర్ట్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు.
1:3 చొప్పున షార్ట్ లిస్ట్
ఆర్టీఐ ప్రధాన కమిషనర్, ఆరు కమిషనర్ పోస్టుల కోసం 1:3 చొప్పున షార్ట్ లిస్ట్‌ను తయారుచేశారు. నియామక విషయంలో ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రభు త్వం కోర్టుకు కూడా నివేదించింది. కమిషనర్ల నియామకానికి హైకోర్టు విధించిన గడువు పూర్తయింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు వెళ్లేందుకు ప్రజాసంఘాలు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.