హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): దసరా, సద్దుల బతుకమ్మ పండుగలు టీజీఎస్ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈ సందర్బంగా ఆర్టీసీ బస్సుల్లో భారీ సంఖ్యలో ప్రయాణాలు సాగాయి. ఈ నెల 1 నుంచి 15 వరకు ఆర్టీసీ బస్సుల్లో సుమారు 707.73 లక్షల మంది ప్రయాణించగా, రూ.307.16 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ మేరకు 10,512 అదనపు బస్సులను నడిపినట్టు పేర్కొన్నారు. ఈ నెల 9,10,11 తేదీల్లో ప్రయాణికులు ఎకువ సంఖ్యలో ప్రయాణించినట్టు తెలిపారు.
ఏఈవోలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి ; మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో ప్రైవేటు కంపెనీలు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా డిజిటల్ సర్వే చేయిస్తుంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏఈవోలతో డిజిటల్ సర్వే చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. డిజిటల్ సర్వే పేరుతో వారిపై అదనపు భారాన్ని మోపుతూ, వేధింపులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని బుధవారం ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణ విజయగాథలో ఏఈవోల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఏఈవోలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ సస్పెండ్ చేయడమేనా ప్రజాపాలన అంటే.. అని నిలదీశారు. సస్పెండ్ చేసిన 163 మంది ఏఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, డిజిటల్ సర్వే ఏఈవోలకు భారం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.