Telangana |హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో సర్కారులో అలజడి మొదలైంది. నాలుగు పథకాలు మొదలుపెట్టి, స్థానిక ఎన్నికల నుంచి గట్టెక్కుదామనుకున్న తరుణంలో ఈ తలనొప్పి ఏమిటని హైరానా పడుతున్నది. ఇప్పటికే పథకాల అమలుకు నిధుల లేమితో కిందామీద పడుతున్న పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చడమెలా? అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లింపు తదితర సమస్యలను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలాలేదు. 43 వేల మంది కార్మికులు సమ్మె చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల నుంచి వ్యతిరేకత, గ్రామీణ పేదలు, చిరుద్యోగులు అష్టకష్టాలపాలయ్యే అవకాశం ఉండగా, ఈ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని ఆందోళనకు గురవుతున్నది. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వ లొసుగులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం అవుతాయనే భయం ప్రభుత్వాన్ని వెంటాడుతున్నది.
నాడు ఓట్ల కోసం హామీలు
నాడు ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఏడాదైనా అమలు దిశగా అడుగు ముందుకు వేయలేదు. పలుసార్లు ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో కార్మికుల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీనికితోడు ఆర్టీసీ ఎండీ వ్యవహార శైలి కార్మికులకు మింగుడు పడటంలేదు. సంక్రాంతికి ముందే సమ్మె నోటీసు ఇవ్వాలని భావించినప్పటికీ, పండుగ సమయంలో సమ్మెకు వెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కార్మిక సంఘాలు భావించాయి. ఆర్టీసీకి లాభాలొస్తున్నాయని సీఎం, మంత్రులు పదే పదే చెప్తూనే కార్మికులకు అందాల్సిన ఏరియర్స్ ఇవ్వకపోవడంతో ఆర్టీసీ సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి.
సోమవారం ఆర్టీసీ యాజామాన్యానికి నోటీసులిచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, కార్మికశాఖ కమిషనర్ సంజయ్‌కుమార్, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌కు నోటీసులిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, ప్రతినిధులు కమలాకర్, కృష్ణ, సుద్దాల సురేశ్, రాములు తదితరులు పాల్గొన్నారు. సమ్మె నోటీసులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.