హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన ఒకరోజు జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు ఆదివారం వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని సంఘాలను సంప్రదించి సమ్మెలో పాల్గొనేందుకు వీలుగా ఎస్‌డబ్ల్యూఎఫ్ బాధ్యత తీసుకోవాలని సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు.
కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేసేందుకు అన్ని రీజియన్ కమిటీ/డిపో కమిటీ సమావేశాలు జరిపి, అన్ని స్థాయిల్లో జనరల్ బాడీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న ‘డిమాండ్స్ డే’ను పాటించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో ఉన్న యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు ఎన్నికలు జరపాలని కోరారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయొద్దని, ఎలక్ట్రిక్ బస్‌లు ఆర్టీసీకే ఇవ్వాలని, విద్యుత్ సవరణ బిల్-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.