హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలపై ఊసెత్తకపోవడమే కాకుండా, కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడుతున్నారు. స మస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం చేపట్టిన ‘చలో బస్‌భవన్’ను విఫలం చేసేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నించడం పై ఆర్టీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఈ నెల 9 తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. చలో బస్‌భవన్‌కు ఆర్టీసీ కార్మికులు హాజరుకాకుండా డిపో మేనేజర్లు భయపెట్టి, బలవంతంగా సీఎం మీటింగ్‌కు తరలించారని పేర్కొన్నారు. మరోపక బస్ భవన్ వద్ద మీటింగ్ జరుగకుండా అనుమతి రద్దు చేసిన అధికార యంత్రాంగం, మరోవైపు జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని విమర్శించారు. ప్రభుత్వ కాళ్ల కింద పనిచేసే కొన్ని సంఘాల నాయకులు బూటకపు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ప్ర భుత్వం ఎన్ని కుట్రలు చేసినా కార్మికులు హాజరై చలో బస్‌భవన్‌ను విజయవంతం చేశారని పేర్కొన్నారు.