హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదా? పథకం ప్రకారమే గుర్తింపు సంఘం ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చిందా? అంటే అవుననే అం టున్నారు ఆర్టీసీ కార్మికులు. ఇటీవల మంత్రి పొన్నంప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీని విలీనం చేయాలంటే ముందుగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగాలని చెప్పడంతో కార్మికులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జూన్ 2న అపాయింటెడ్ డే లేనట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు సంఘం ప్రతినిధులు మాత్రమే విలీన కమిటీలో ఉంటారని మంత్రి కుండబద్దలు కొట్టడమే ఇందుకు నిదర్శనంగా కార్మికులు చెబుతున్నారు. అపాయింటెడ్ డే అనేది ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏండ్ల కల. దానిని నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సా కారం చేస్తే.. అనూహ్యంగా వచ్చిన ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియ మొత్తం ఆలస్యమైంది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కార్మికుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారీ నీళ్లు జల్లుతూనే ఉన్నది. రెండుసార్లు సమ్మె నోటీసులు ఇచ్చినా.. మూడు రోజులు సమ్మె చేసినా అపాయింటెడ్ డేకి నేటికీ మోక్షం కలుగలేదు.
డిమాండ్ డే పాటించండి: కార్మిక సంఘాలు
జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే 31న ‘డిమాండ్ డే’ పాటించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి చర్యలు చేపట్టి శాసనసభలో బిల్లు కూడా పాస్ చేస్తే.. కేవలం విలీన తేదీని ప్రకటించాల్సిన సమయంలో ప్రభుత్వం మారిందని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న చెప్పారు. మే డే రోజున కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇదే విషయాన్ని విన్నవించామని చెబుతున్నారు. కానీ, ఇటీవల విలీనం కంటే ముందు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కార్మికుల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయిందని మండిపడింది. అందుకే మే 31న సింగిల్ డిమాండ్‌పై రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో/యూనిట్లలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి ‘డిమాండ్ డే’ పాటించాలని జేఏసీ పిలుపునిచ్చింది.
1న ఇందిరాపార్క్‌లో నిరసన దీక్ష
జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. కొన్ని కార్మిక సంఘాలు తలపెట్టిన ఒకరోజు నిరసన దీక్షకు పోలీసుశాఖ నుంచి అనుమతి లభించింది. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చేపట్టబోయే దీక్షకు ఆర్టీసీ కార్మికులు వేల సంఖ్యలో సంఘాలకు అతీతంగా కలిసిరావాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కోరారు.