హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ నిర్వీర్యానికి కుట్ర జరుగుతున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందడానికి, ఆర్టీసీ బస్సులకు పెట్టుబడి పెట్టే బాధ్యత నుంచి తప్పుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు బస్సులను తీసుకొస్తున్నదని విమర్శిస్తున్నారు. 2030 నాటికి రాష్ట్ర వ్యా ప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని ప్రభు త్వం ప్రకటించిందని, దీంతో గ్యారేజీ సిబ్బంది, డ్రైవర్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా టీజీఎస్ఆర్టీసీ కాస్తా ప్రైవేట్ విద్యుత్తు బస్సుల సంస్థగా మారిపోతుందని పేర్కొంటున్నారు.
ఆర్టీసీ యాజమాన్యం చర్యలను అడ్డుకునేందుకు ఈ నెల 6న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ‘విద్యుత్తు బస్సులు- ప్రజలు, ఆర్టీసీపై ప్రభావం’ అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌రావు తెలిపారు. సదస్సుకు ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాల నాయకులకు ఆహ్వానించారు. రెండు బడా కంపెనీలకు ఈవీ బస్సులను కట్టబెట్టి ఆర్టీసీని ఆగం జేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎంయూ ప్రధాన కార్యదర్శి ఎం థామస్‌రెడ్డి ఆరోపించారు. మహిళా సంఘాల పేరిట తమ బినామీలకు ఈవీ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు.