హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు కార్మికులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. గుర్తింపు సంఘం ఎన్నికల పేరుతో ఆర్టీసీ విలీన అంశాన్ని పక్కనపెట్టే యోచనలో ఉన్న ప్రభుత్వం కండ్లు తెరిపించేందుకు మలిదశ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ప్రధాన లక్ష్యంగా జూన్ 1న కార్మిక సంఘాలతో కలిసి ‘చలో ఇందిరా పార్క్’కు పిలుపునిచ్చారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగ మిత్రులందరూ విలీన ప్రక్రియను అడ్డుకొనే కుట్రలను గమనించాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సూచించారు.
కొంతమంది కుట్రదారులు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా అడ్డు తగులుతూ ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకొనేవారు జూన్ 1న నిర్వహించే చలో ఇందిరాపార్క్ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఆ రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఈ విషయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జూన్ 1న దీక్ష, నిరసన కార్యక్రమాలకు నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. కార్మికులు యూనియన్లకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ 2నే అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జూన్ 1న ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య కార్యదర్శి కె.రాజిరెడ్డి తెలిపారు. టీజేఎంయూ ప్రకటించిన సామూహిక నిరాహార దీక్షకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. విలీనం అనంతరం యూనియన్లు కొనసాగితే అప్పుడు ఎన్నిక గురించి ఆలోచించాలని, ముందు విలీనం చేయాలని కోరారు. యూనియన్లకు అతీతంగా ఇందిరాపార్ వద్ద ఒక రోజు సామూహిక నిరాహార దీక్ష చేయడానికి తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.