హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడం, రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రభుత్వం 340 అద్దెబస్సుల కోసం టెండర్లు పిలిచింది. గడువు ముగుస్తున్నప్పటికీ టెండర్ వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తేనే టెండర్లు వేస్తామని, లేదంటే ఇక అంతేనని అద్దెబస్సుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు తేల్చి చెప్పారు. టెండర్ల దాఖలుకు జనవరి 3 గడువు కాగా, అదే రోజు మధ్యాహ్నం తర్వాత టెండర్లు తెరుస్తారు. మరోవైపు, గురువారం ఆర్టీసీ అధికారులు నిర్వహించిన ప్రీబిడ్డింగ్ సమావేశంలో ప్రధానంగా అద్దెబస్సుల కేఎంపీఎల్ అంశంపై చర్చించారు. ప్రస్తుతం కేఎంపీఎల్ 4.5-4.6గా ఉండగా నగరంలో దానిని 4కు తగ్గించాలన్న డిమాండ్ ఉంది. అయితే, ఇది సాధ్యంకాదని చెప్తున్న ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు అద్దెబస్సుల సంఘం ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కారణంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో మరో 320 వరకు కొత్త బస్సులు తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తున్నది. నిరుడు 560 వరకు విద్యుత్తు బస్సులకు టెండర్లు పిలిచినా వాటి సంగతి ఏంటన్న విషయంలో స్పష్టత లేదు. తాజాగా 340 అద్దెబస్సులకు టెండర్లు పిలిచినా తమ సమస్యలు పరిష్కరించకుంటే టెండర్లు వేయబోమని అద్దెబస్సుల యజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా సమకూర్చుకోవాలనుకుంటున్న 320 బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేస్తుందా? లేదా? అన్న విషయంలో స్పష్టత లేదు. మరోవైపు, నగర అవసరాల కోసం సంక్రాంతి నాటికి 200 డీజిల్ బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.