RTC Tarnaka Hospital : పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటున్న టీజీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ‘ఉత్తమ పర్యావరణ పరిరక్షణ’ అవార్డు వరించింది. ప్రభుత్వ ఆస్పత్రుల విభాగంలో బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపులో ఆస్పత్రి యాజమాన్యం చేసిన కృషికి బహుమతిగా ఈ అవార్డు లభించింది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా సనత్‌నగర్‌లోని టీజీపీసీబీ కార్యాలయంలో పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) గురువారం టీజీఎస్ఆర్టీసీ తార్నాక ఆస్పత్రి బృందానికి అందజేశారు.
తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించడం పట్ల సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. దవాఖానలో ఆరోగ్య వసతుల్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణను కొనసాగించేందుకు ఈ అవార్డు మరింత ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఆస్పత్రిలో బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపు, ఘన వ్యర్థాల నిర్వహణ పకడ్బందిగా చేస్తోన్న వైద్యులు, సిబ్బందిని ఈ సందర్భంగా సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు.