నిర్మల్/ రంగారెడ్డి : లంచాలకు మరిగిన నలుగురు మున్సిపల్ ఉద్యోగులను ఏసీబీ (ACB raids ) అధికారులు గురువారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్మల్( Nirmal) , రంగారెడ్డి జిల్లా తూంకుంట( Tumkunta ) మున్సిపల్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గైక్వాడ్ సంతోష్‌కుమార్, అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎండీ సోయబ్ అహ్మద్‌ను గురువారం బాధితుడు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించాలని సంప్రదించాడు. అయితే లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో అధికారులు వ్యూహం ప్రకారం బాధితుడి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుని కేసు నమోదు చేశారు. విధుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు ఇద్దరిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో ..
రంగారెడ్డి జిల్లా తూంకుంట మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేట వార్డ్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ కె రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఏ శ్రవణ్ రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బాధితుడు ఇంటికి సంబందించిన మ్యూటేషన్ పని కోసమని అధికారులను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు వలపన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.