RTC Strike | ఎక్కడి బస్సులు అక్కడే..! తొలిరోజు ఆర్టీసీ సమ్మె విజయవంతం
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో తొలిరోజు సమ్మె విజయవంతమైంది.
- తొలిరోజు ఆర్టీసీ సమ్మె విజయవంతం
- వేలాదిగా రోడ్లెక్కిన ఆర్టీసీ కార్మికులు
- అంతటా డిపోలకే బస్సులు పరిమితం
- అన్ని డిపోల ఎదుట పోలీసుల పహారా
- అద్దెబస్సులు తిరుగడంపై కార్మికుల ఫైర్
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సర్కార్ విఫలం
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- పలు సంఘాల మద్దతు కోరుతున్న జేఏసీ
- నేడు ఉదయం మహాధర్నాలకు పిలుపు
ఆర్టీసీ కార్మికలోకం కన్నెర్రజేసింది. రెండున్నరేండ్లుగా మాటలతో మభ్యపెడుతున్న మోసాలను గొంతెత్తి నిలదీసింది. ఆర్టీసీని
ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని నినదించింది. ఉద్యోగ భద్రత కల్పించాలని డిపోలు దద్దరిల్లేలా గర్జించింది. వందల గొంతులే.. వేల గొంతుకలై ప్రభుత్వ అసమర్థతను నిలదీసింది. ‘వివ్ వాంట్ జస్టిస్’ అంటూ న్యాయం కోసం కదంతొక్కింది. డిమాండ్లు నెరవేర్చకపోతే మరో సకల జనుల సమ్మె తప్పదని కాంగ్రెస్ సర్కార్‌కు హెచ్చరికలు జారీచేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో తొలిరోజు సమ్మె విజయవంతమైంది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎన్ని కుట్రలు పన్నినా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆర్టీసీ కార్మిక వర్గమంతా సమ్మెలో పాల్గొన్నది. బుధవారం తెల్లవారుజాము నుంచే బస్ డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. కార్మికుల ఆందోళనను ఆడ్డుకొనే క్రమంలో ప్రతి ఆర్టీసీ బస్ డిపో వద్ద పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కొన్నిచోట్ల తమ డిమాండ్ల సాధన కోసం డిపోల ఎదుట నిరసన తెలుపుతున్న కార్మికులను వారికి మద్దతుగా నిలిచిన కార్మిక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆ కుట్రలను ఛేదించుకుంటూ కార్మికులు దిగ్విజయంగా వివిధ నిరసన రూపాలను ప్రదర్శించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వైఫల్యం
ఆర్టీసీ కార్మికులు కచ్చితంగా సమ్మెకు వెళ్తారని ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సమ్మె నోటీసులు ఇచ్చినా కార్మికుల డిమాండ్లను పట్టించుకోకుండా, లేబర్ కమిషన్‌తో జరిగిన చర్చలకు వెళ్లకుండా, ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణ చేయలేమని నిర్ధారించుకున్న సర్కార్.. తీరా సమ్మెపై కార్మికులపైనే నిందలు వేయాలని చూసింది. రాజకీయంగా కుట్రలు చేస్తూనే ప్రజారవాణాను గాలికొదిలేసింది. దీంతో బుధవారం ఉదయం నుంచే ప్రయాణికులు బస్స్టాండ్లలో బస్సుల కోసం పడిగాపులు కాశారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకొంటారు. సమ్మె గురించి తెలియని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని రోజుకు రూ.800 చొప్పున తాత్కాలిక కండక్టర్లుగా ఆర్టీసీ నియమించుకొంటున్నది. హడావుడిగా ఔట్‌సోర్సింగ్‌లో తీసుకొన్న పలువురు డ్రైవర్ల అనుభవలేమి కారణంగా పలుచోట్ల బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సులో వెళ్లిన పలువురు ప్రయాణికులు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడంతో రూ.50 ప్రయాణానికి కూడా రూ.100కు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేశారు.
సమ్మెకు కృష్ణయ్య, మందకృష్ణ మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్యను కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. బడుగులైన కార్మికుల కోసం సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. అంతకుముందు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆయన నివాసంలో జేఏసీ నేతలు కలిసి సమ్మెకు మద్దతివ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జేఏసీ సమ్మెలో ఎమ్మార్పీఎస్తోపాటు అణగారిన వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తామని, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడుతానని మందకృష్ణ మాదిగ హామీ ఇచ్చారు. వారిని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, ఎండీ మౌలానా, వల్లూరి బాబు, పీ అప్పారావు, బీ యాదయ్య, ఎన్ కమలాకర్‌గౌడ్, నగేశ్పటేల్, నాగశేషు, ఏపూరి శ్రీను తదితరులు ఉన్నారు.
నేడు అన్నిడిపోల ఎదుట మహాధర్నా
గురువారం ఉదయం 5 గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకు ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపునిచ్చింది. డిమాండ్లను పరిషరించకుండా ప్రభుత్వం, యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ దాటవేత ధోరణిని అవలంబిస్తున్నాయని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. 32 డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం వేసిన కమిటీ చేతులెత్తేయడంతో విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగినట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021 వేతన సవరణ 30% తగ్గకుండా అమలు, హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సుల రద్దు, ఇతర జోన్లకు ఉద్యోగుల బదిలీ రద్దు వంటివి అమలుచేసేంత వరకూ తమ సమ్మె తప్పదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

