తమ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం తమను చర్చలకు పిలవలేదని తెలిపారు. కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఈదురు వెంకన్న మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశాన్ని విస్మరించిందని అన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని వెల్లడించారు. ఈవీ బస్సులు తీసుకొస్తూ హైదరాబాద్ డిపోల్లో ఉన్న ఉద్యోగులను జిల్లాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈదురు వెంకన్న ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎవరూ భయపడవద్దని.. కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని హెచ్చరించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.
గత ప్రభుత్వం వేసిన కమిటీతో మీకేం సంబంధమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈదురు వెంకన్న నిలదీశారు. కాలయాపన కోసమే కమిటీ పేరుతో నాటకమాడుతున్నారని మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న మెట్రో రైలు వ్యవస్థను వెంటనే విలీనం చేశారు.. కానీ ఆర్టీసీని మాత్రం విలీనం చేయకుండా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా చర్చలకు పిలిస్తే జేఏసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ ని అన్యాక్రాంతం చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ప్రశ్నించారు. మహాలక్ష్మీ పథకానికి ఎన్ని నిధులు విడుదల చేశారో.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ప్రభుత్వానికి ఏంటి బాధ అని ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే.. వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమ్మె చేసేది కార్మికుల కోసం కాదని.. రాష్ట్ర ప్రజల కోసమని స్పష్టం చేశారు.