TSRTC | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ విలీన ప్రక్రియను మూలన పడేసింది. ఐదున్నర నెలలు దాటినా ఈ అంశంపై నోరే మెదపడం లేదు. మహిళలకు మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తమ సమస్యలు, ప్రయోజనాలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది అసహనంతో రగిలిపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తయిన ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విలీన ప్రక్రియకు గత ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా విధివిధానాలను ప్రస్తుత ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉన్నది. ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తయితే సంస్థపై జీతాల భారం పూర్తిగా తొలగనున్నది. కేవలం ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియను పక్కకు పెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేతన సవరణ బకాయిల చెల్లింపునకే ఈ ప్రభుత్వం కిందామీదా పడుతున్నదని, ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టిందన్న చర్చ సాగుతున్నది. సంస్థ విలీన ప్రక్రియ అంశాన్ని ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి.
ప్రయోజనాలు కోల్పోతున్న వందలాది మంది ఉద్యోగులు
ఆర్టీసీ విలీనమైతేనే సంస్థ ఉద్యోగులు పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూ ఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ ప్రయోజనాలకు దూరమవుతున్నారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత నుంచి ఇప్పటివరకు 1,800 మంది ఉద్యోగ విరమణ పొందారు. మరో రెండు నెలల్లో 300 మందికిపైగా విరమణ పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని ఆశపడుతున్నారు. వారి ఆశలను కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తున్నది. ప్రభుత్వం తీరు పట్ల ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకు ఆగ్రహం పెరుగుతున్నది.
ఆర్టీసీకి ఊపిరిలూదిన కేసీఆర్
తీవ్ర ఆర్థిక కష్టనష్టాలతో దివాలా దిశలో ఉన్న టీఎస్ఆర్టీసీని 2023 ఆగస్టులో ప్రభుత్వంలో విలీనం చేసి ఆనాటి సీఎం కేసీఆర్ సంస్థకు ఊపిరిలూదారు. సెప్టెంబర్ మొదటివారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది. దీంతో దాదాపు 43,373 మందికి ఉద్యోగ భద్రత దొరికినట్లయింది. ఈ ప్రక్రియను పూర్తిచేస్తే సంస్థలోని ఉద్యోగులకు పింఛన్ సదుపాయం సైతం లభించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న సిబ్బంది మొత్తం రాష్ట్ర ప్రజారవాణా శాఖ ఉద్యోగులుగా మారుతారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఆర్టీసీ విలీన ప్రక్రియ నిలిచింది. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే 90 శాతం పూర్తయిన విలీన ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆ ఉసెత్తకపోవడంతో ఆర్టీసీ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటుచేసిన కమిటీలోని చాలా మంది ఐఏఎస్ అధికారులు ఆయా స్థానాల నుంచి బదిలీ అయ్యారు. ప్రభుత్వం మారడంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడమే లేదనే ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేల్
ప్రభుత్వంలో విలీనం పూర్తయితే పభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకారం స్కేల్‌ను వర్తింపజేసే అవకాశం ఉన్నది. ఆర్టీసీలోని శ్రామిక్, అటెండర్, డ్రైవర్, కండక్టర్ మొదలుకొని మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇలా సంస్థలోని అన్ని పోస్టులను ప్రభుత్వంలోని తత్సమాన పోస్టుల్లోకి మారుస్తారు. సిబ్బంది ఆర్టీసీలో చేరిన సంవత్సరం ఆధారంగా పింఛన్ విధానాన్ని ఖరారు చేస్తారు. విలీనం పూర్తయితే ఉద్యోగులతో సమానంగా ప్రతి ఐదేండ్లకోసారి పీఆర్సీ ద్వారా జీతాల పెంపు ఉంటుంది.
కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి
ఆర్టీసీ సంస్థ విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధి విధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ రద్దయిన నేపథ్యంలో ఈ సర్కారు కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి. దాని నుంచి నివేదిక తెప్పించుకొని ఆ నివేదిక ప్రకారం అమలుచేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను వెంటనే పెంచాలి. ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తన మాటను నిలబెట్టుకోవాలి.
– యాదయ్య, టీఎంయూ నేత
ఆర్టీసీ కార్మికులను మోసగించడమే..
ఎన్నికల ముందు ఆర్టీసీకి అన్ని వేళలా అండగా ఉంటామని కాంగ్రెస్ చెప్పడంతో నమ్మాం. ఆ పార్టీకి ఆర్టీసీ కార్మికులు అండగా నిలిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడమే లేదు. 90 శాతం పూర్తయిన ప్రక్రియపై చర్చించకపోవడం ఆర్టీసీ కార్మికులను మోసగించడమే. ఇప్పటికైనా విలీనం పూర్తి చేసి ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలి.
– ఏవీఎన్ రెడ్డి, టీఎంయూ నేత
వేయికండ్లతో ఎదురుచూస్తున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి.దీని కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 90 శాతం పూర్తయిన ప్రక్రియను ముగించాలి. విలీన ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటికే 1,800 మంది ఉద్యోగులు విరమణ పొందారు. ఆగస్టులోగా మరో 300 మంది వరకు ఉద్యోగాల నుంచి రిటైరవుతారు. వీరందరికీ ప్రయోజనాలు అందలేదు.
– థామస్‌రెడ్డి, టీఎంయూ నేత