హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తేతెలంగాణ) : మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లోని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి ఆలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రత్యేక అధికారులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సీటీఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప పాల్గొన్నారు.
రంజాన్‌కు విస్తృత ఏర్పాట్లు ; అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇబ్బందుల్లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మార్చి 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో సచివాలయంలో మంగళవారం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్థనా మందిరాల వద్ద రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి తౌసిఫ్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.