హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో రిటైరైన ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న ‘చలో బస్ భవన్’కు విశ్రాంత ఉద్యోగుల సారథ్య కమిటీ పిలుపునిచ్చింది. తమకు రావాల్సిన బకాయిల కోసం నాలుగైదుసార్లు ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ ఈడీ, ఎఫ్ఏ, సీపీఎంలను బస్‌భవన్‌లో కలిసి వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదని మండిపడింది. దీంతో పోరాటం చేయాల్సిందేనని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.
ఈ మేరకు ‘చలో బస్‌భవన్’కు పిలుపునిచ్చినట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2017 పీఆర్సీ ఏరియర్స్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డిఫరెన్సులు, 2025 డిసెంబర్ వరకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులతోపాటు ఇటీవల రిటైరైన ఉద్యోగులకు రావలసిన గ్రాట్యుటీ, ఇతర సెటిల్మెంట్లను సాధించుకునేందుకు పోరాటమే శరణ్యమని తేల్చిచెప్పింది.
ముఖ్యంగా రిజెక్ట్ అయిన పీఎఫ్ అప్లికేషన్లను సరిచేయకపోవడం, డీడీలు కట్టిన వారికి పెన్షన్ రాకపోవడం, 2013, 2017 పేసేలు వివరాలు పీఎఫ్ కమిషనర్‌కు పంపకపోవడంతో తగ్గిన పెన్షనే వస్తుందని ఆవేదన వ్యక్తంచేసింది. ఇలాంటి సమస్యలతో రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపింది. రోజురోజుకూ రిటైరయ్యే ఉద్యోగుల సంఖ్య పెరిగి బకాయిలు పేరుకుపోతుండడం, మరోవైపు అనారోగ్య కారణాల వల్ల చనిపోయే వారి సంఖ్య పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
బకాయిల సాధన కోసం ఈనెల 21 బస్‌భవన్ ఎదుట శాంతియుత నిరసన చేపట్టడానికి ముందుగా ఈనెల 17న అన్ని డిపోల ఎదుట సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్టు కమిటీ తెలిపింది. ఆ తర్వాత డిపో మేనేజర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నది. ‘నా బకాయి డబ్బుల కోసం నేను’ అంటూ ప్రతి రిటైర్డ్ ఉద్యోగి బస్‌భవన్‌కు తరలిరావాలని కోరింది.