TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులకు 2021 వేతన సవరణ ఐదేళ్లు దాటినా ఇంకా ఎందుకు అమలు చేయడం లేదని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ప్రశ్నించారు. చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలు పోషించలేక ఆర్టీసీ కార్మికులు ప్రతి నెల అప్పులు చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి నిద్రహారాలు మాని అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
కార్మికులతో గొడ్డు చాకిరీ చేయిస్తూ వారికి ఇవ్వాల్సిన ఆర్థిక పరమైన అంశాలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి పెండింగ్లో పెట్టిన ఘనత ఆర్టీసీ యాజమాన్యానికే దక్కుతుందని ఈదురు వెంకన్న విమర్శించారు. 2024-2025 లో ఆర్టీసీ సంస్థకు మహాలక్ష్మి ద్వారా 6,680 కోట్ల ఆదాయంతో సంస్థకు అధిక లాభాలు వచ్చాయని ప్రభుత్వం, యాజమాన్యం అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. కాబట్టి ఏండ్ల తరబడి పెండింగ్ లో 2021 వేతన సవరణ, 39% ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 2017 – 2021 ఫ్రింజ్ బెనిఫిట్స్, అలవెన్స్లను చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ, యాజమాన్యాలను ఎంప్లాయీస్ యూనియన్ తన లేఖల ద్వారా కోరిందన్నారు.