హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో 1,000 డ్రైవర్ పోస్టులకు 28,954 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 39 మంది మహిళలు, 28,915 మంది పురుషులు ఉన్నారు. 743 శ్రామిక్ పోస్టులకు 26,060 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 508 మంది మహిళలు, 25,552 మంది పురుషులు ఉన్నారు.
అయితే తొలుత దరఖాస్తు తేదీ అక్టోబర్ 28తో ముగిసినా ఎంతమంది ఐప్లె చేసుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ పలు కథనాలు రాసింది. స్పందించిన అధికారులు గురువారం వివరాలు వెల్లడించారు.
ప్రభుత్వానికి హైకోర్టు 5వేల జరిమానా
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో జీవో 111 అమలు తీరు గురించి నివేదించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై హైకోర్టు ఆ గ్రహం వ్యక్తంచేసింది. పూర్తి వివరాలతో ఎందుకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించి ప్ర భుత్వానికి రూ.5వేలు జరిమానా విధించింది. వారం రోజుల్లో ఈ మొత్తాన్ని న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది.