హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన విలువైన వస్తువులు, నగదును బాధితుడికి అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఆర్టీసీ కండక్టర్. అచ్చంపేట డిపోకు చెందిన కండక్టర్ వెంకటేశ్వర్లు.. ఈ నెల 26న అచ్చంపేట-హైదరాబాద్ రూట్లో విధులు నిర్వహించాడు. ఈక్రమంలో ఓ ప్రయాణికుడు బస్సులో మర్చిపోయిన బ్యాగ్‌ను గుర్తించి దానిని తెరిచి చూడగా అందులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతోపాటు నగదు, సర్టిఫికెట్లు ఉన్నాయి.
ఈ విషయాన్ని అచ్చంపేట డీఎం మురళీ దుర్గాప్రసాద్‌కు తెలియజేశాడు. దీంతో ఆయన ఎంజీబీఎస్‌లోని మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని సూచించాడు. ఇంతలోనే అనిల్‌కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకు ఫోన్ చేసి తన బ్యాగ్‌ను బస్సులో మర్చిపోయినట్టు దీంతో ఆర్టీసీ అధికారులు వివరాలు తెలుసుకొని బ్యాగ్‌ను అనిల్‌కు అప్పగించారు. కండక్టర్ నిజాయితీని గుర్తించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోమవారం బస్‌భవన్‌లో వెంకటేశ్వర్లును సన్మానించారు.