TGS RTC | పరకాల, ఆగస్టు 19: మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయా ణం వెసులుబాటు కల్పించిన టీజీఎస్ఆర్టీసీ.. అవకాశం దొరికినప్పుడుల్లా ఇతర ప్రయాణికులను దోచుకుంటున్నట్టు తెలుస్తున్నది. రాఖీ పండుగను ఆసరా చేసుకొని అధిక వసూళ్లకు తెరలేపింది. ప్రయాణికుల రద్దీతో అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసి టికెట్ ధరలను పెంచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హనుమకొండ నుంచి ఉప్పల్ ఎక్స్ప్రెస్ సర్వీసులో ఉదయం రూ. 200 టికెట్ ఉండగా.. సాయంత్రానికి మరో రూ.50 పెంచేశారు. తిరుగు ప్రయాణంలో ఉప్పల్ నుంచి హనుమకొండకు టికెట్ ధర రూ.250 కావడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు. పలువురు ప్రయాణికులు ఇదేందని అడుగగా ‘మేమేం చేస్తాం.. టికెట్ ధరలు మేము కాదు కదా పెంచేది. ఇది స్పెషల్ బస్సు.. ప్రయాణికుల రద్దీ వల్ల ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతున్నాం.
టికెట్ ధర ఎక్కువ అనిపిస్తే దిగిపో’ అని సదరు కండెక్టర్ బదులిచ్చారు. చేసేదేం లేక పలువురు ప్రయాణికులు రూ.250 చెల్లించి ప్రయాణించాల్సి వచ్చింది. కాగా ప్రత్యేక సర్వీసుల పేరుతో చార్జీలు పెంచిన అధికారులు కనీసం రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచినా బాగుండేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.