మంచిర్యాల అర్బన్/ కరీంనగర్ విద్యానగర్/తెలంగాణ చౌక్/కొత్తపల్లి, ఏప్రిల్ 23: ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలుపడుతున్నరు. కండక్టర్ లేకుండా కేవలం డ్రైవర్లతో అద్దె బస్సులు నడిపేందుకు యత్నిస్తున్నారు. నైపుణ్యంలేని డ్రైవర్ల చేతికి బస్సులు ఇవ్వడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రయా ణం చేస్తున్నవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గమ్యానికి చేరుతున్నారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా.. కరీంనగర్ అధికారులు మాత్రం పట్టుదలకు పోయి టిమ్ ఆపరేటింగ్ రాని అద్దె బస్సు డ్రైవర్‌ను వరంగల్‌కు పంపించారు.
కరీనంగర్‌లోని రాంపూర్ బైపాస్ వద్ద డ్రైవర్ శ్రీధర్ బస్సు నడిపిస్తూనే టిమ్‌తో ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్న క్రమంలో ఎదురుగా వెళ్తున్న లారీని ఢీ కొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుకాగా డ్రైవర్‌తోపాటు బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపల్లికి చెందిన ఫర్హానా, హసీనా, మున్నీ , ఆషాబీ , కరీంనగర్‌కు చెందిన సుకృతికి గాయాలు కాగా కొందరికి కుట్లు పడ్డాయి. ఆర్టీసీ అధికారులు కనీసం ఘటనాస్థలానికి గానీ, దవాఖానకుగాని వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు. అద్దె బస్సు డ్రైవర్‌కు టిమ్‌తో టికెట్లు ఇచ్చే శిక్షణ లేకున్నా అతడికి సదరు మిషన్ ఇచ్చి వరంగల్‌కు బస్సును పంపించిన అధికారుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు.
సమ్మె విరమించే వరకు ప్రయాణికులెవరూ బస్సుల్లో ప్రయాణించవద్దని ఆ సంస్థ ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ఏరియాలో గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు.. ఆటోను ఢీకొట్టగా, ఆటో డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మంచిర్యాల ఏసీసీ ఏరియాకు రాగానే మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో బొక్కలగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ చిప్పరి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలుకాగా మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించారు. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉండగా, అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్ బస్సు నడుపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడుతున్నారు.