హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ)/నేరేడుచర్ల: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పోకల వినోద్‌కుమార్(28) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న నేరేడుచర్లకు చెందిన మంత్రిప్రగడ సీతమ్మ (56) కావలి దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సీతమ్మ కొడుకు సీతారాం పరిస్థితి కూడా విషమంగా ఉంది. సంక్రాంతి పండుగను నెల్లూరులో ఉంటున్న తన కూతురి వద్ద జరుపుకోవడానికి కొడుకుతో కలిసి సీతమ్మ వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.