జూలూరుపాడు, అక్టోబర్ 9 : ఎదురుగా వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొనడంతో(Road accident) ఇద్దరు భవానీ మాలధారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Dist)జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన గుగులోత్ మనోహర్ (20), బానోత్ సంతోశ్(22) ఇద్దరూ భవానీ మాల ధరించారు.
వ్యక్తిగత పని నిమిత్తం ఆటోలో ఖమ్మం వైపు వెళ్తుండగా.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కొమ్ముగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది.
దీంతో ఆటో నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న మాలధారులు మనోహర్, సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రాణాప్రతాప్ సందర్శించి ప్రమాద వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.