హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో ఏపీఎస్ఆర్టీసీ వాటా పొందాలని కుట్ర చేయడం తగదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) పేర్కొంది. బస్‌భవన్ స్థలం, ముషీరాబాద్ డిపో స్థలాలు, గౌలిగూడ బస్టాండు స్థలం, తార్నాక హాస్పిటల్ వంటివి తెలంగాణ ఆస్తులని, రాజ్యాంగంలోని ఆర్టికల్-9 ప్రకారం ఎక్కడి ఆస్తులు అక్కడే అనే ప్రాతిపదికన ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏపీకి వాటా ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టంచేసింది.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో దశాబ్దకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ విభజన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధానకార్యదర్శి థామస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్‌గౌడ్ నాయకత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్టీసీలో కార్మిక యూనియన్ల గుర్తింపు ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కార్మిక శాఖ కమిషనర్‌కు వినపతిపత్రం అందజేశారు. స్పందించిన కార్మికశాఖ కమిషనర్ కార్మికులు ఎదురొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పినట్టు తెలిపారు. అదేవిధంగా అడిషనల్ లేబర్ కమిషనర్, జాయింట్ కమిషనర్‌కు కూడా వినతిపత్రాన్ని అందజేశారు.
ఖైరతాబాద్, జూలై 5: పదేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ విసిగిపోయానని, తనకు న్యాయ సహాయం చేయాలని జెరూసలేం మత్తయ్య తెలుగు రాష్ర్టాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసుతో పాటు మరో నాలుగు కేసుల్లో 2015 నుంచి నేటి వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని వాపోయారు. కోర్టు ఖర్చులకు కూడా డబ్బుల్లేవని, ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో తన అంశాన్ని చర్చించి, న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.