హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఆరెస్సెస్, బీజేపీ.. రెండూ వేర్వేరు కాదు, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా రెండు వ్యవస్థలు కలిసి మెలిసి పనిచేస్తాయి. కానీ ఈ భావన ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయింది. ఆరెస్సెస్ చెప్పినట్టే బీజేపీ వింటుందని గతంలో అనుకునేవారు. కానీ మోదీ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. బీజేపీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం వంటివి జరిగిపోయాయి. ప్రధాని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కొందరు ముఖ్య నేతలు కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆరెస్సెస్‌తో సంప్రదింపులు జరిపే సంప్రదాయానికి స్వస్తి పలికారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నది.
మోదీ బలమైన నేతగా ఉండటంతో ఆరెస్సెస్ కూడా దాదాపు దశాబ్దకాలంగా మౌన ప్రేక్షకుడి పాత్ర పోషించింది. కానీ గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రాభవం తగ్గుతున్నదని ఆరెస్సెస్‌కు అర్థమైంది. అంతే.. పార్టీపై పట్టుకోసం సంఘ్ తీవ్రంగా శ్రమిస్తున్నది. దీనిని నిలువరించేందుకు కొందరు బీజేపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ 75 ఏండ్ల అంశాన్ని తెరమీదికి తెచ్చారన్న చర్చ జరుగుతున్నది.
వాస్తవానికి ఆరెస్సెస్‌లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తుంటారు. బీజేపీ పాలనలో ప్రభుత్వ వ్యవహారాల్లో సంఘ్ జోక్యం చేసుకోవడం కూడా పరిపాటే. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మోదీ ప్రాబల్యం పెరిగిపోతుండగా, ఆరెస్సెస్‌తో సంబంధాలు దిగజారిపోయాయి. సంఘ్‌తో సంబంధం లేకుండా మోదీ చెప్పిందే వేదవాక్కు అనే స్థాయిలో హవా నడిచింది. కానీ 2024 ఎన్నికల నాటికి మోదీ ఇమేజ్ తగ్గిందని ఆరెస్సెస్ గుర్తించిందని చెప్తున్నారు. అందుకే క్రమంగా పార్టీపై తన పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పేర్కొంటున్నారు. 2024 ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో సంఘ్‌కు కొత్త ఆయుధం దొరికినట్టయిందని, ఆ తర్వాత కూడా మోదీ తరుచూ పాలనలో తప్పిదాలు చేస్తుండటం మరింత కలిసి వచ్చిందని వివరిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్‌తో మోదీ డొల్లతనం బయటపడిందని ఆరెస్సెస్ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు ఎలాంటి నష్టం జరగలేదని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. భారత్‌కు జరిగిన నష్టంపై ఒక్క ఆధారమైనా చూపగలరా? అంటూ జాతీయ భద్రతా సలహాదారుల అజిత్ ధోవల్ సవాల్ విసిరారు. కానీ, సైనికాధికారులు ఇందుకు విరుద్ధంగా ప్రకటనలు చేశారు. భారత్‌కు ఎంత నష్టం జరిగిందనేది ముఖ్యం కాదని, పైలట్లు అందరూ తిరిగి వచ్చారని, వ్యూహాత్మక తప్పిదాలను వెంటనే సవరించుకున్నామని సీడీఎస్ అనిల్ చౌహాన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. తాము ఒప్పందాలపై సంతకాలు చేస్తుంటామని, కానీ ఆయుధాలు సమయానికి తమ చేతికి అందవని సాక్షాత్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముందే ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తెగేసి చెప్పారు.
దేశ రక్షణ విషయాల్లోనే అధికారులు ఇలా బహిరంగంగా విమర్శించడం అంటే మోదీ ప్రభుత్వాన్ని పట్టించుకోనట్టేనని ఆరెస్సెస్ భావిస్తున్నదట. ఈ పరిణామాల నేపథ్యంలోనే మోదీ రిటైర్మెంట్ను తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. ‘ఆరెస్సెస్, బీజేపీ మధ్య 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే ఆధిపత్య పోరు నడుస్తున్నది. తామే గెలవాలని రెండు వైపులా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టగ్ ఆఫ్ వార్ కారణంగానే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికలు ఆగిపోయాయి. మా మనిషి రావాలంటే, మా మనిషి రావాలని రెండు వ్యవస్థలూ ప్రయత్నిస్తున్నాయి’ అని సీనియర్ ఆరెస్సెస్ నేత ఒకరు తెలిపారు. సంఘ్, బీజేపీ మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరే సూచనలు కనిపించడం లేదని, కాబట్టి ఇప్పట్లో జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో అమిత్ షా ప్రభావం తగ్గిందనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆయన వయసు దాదాపు 60 ఏండ్లే. ఇంకా 15 ఏండ్లు కొనసాగే అవకాశం ఉన్నది. కానీ ఆయన తన రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. వాస్తవానికి పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా మోదీ ఉంటేనే అమిత్ షాకు విలువ. మోదీ లేకుంటే అమిత్ షా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అమిత్ షా తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారంటే.. మోదీ రిటైర్మెంట్ దగ్గర పడ్డట్టేనని సీనియర్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి గడ్కరీ ఇటీవల చేస్తున్న విమర్శలు, నర్మగర్భ వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయని అంటున్నారు. దేశంలో సంపద ధనికుల దగ్గరే పోగవుతున్నదని, తమ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆయన ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక తాజాగా ‘11 ఏండ్లలో మీరు చూసింది న్యూస్ రీల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిని బట్టి ప్రధాని మార్పు ఖాయమని, కొత్త నేత సారథ్యంలో మరింత చురుగ్గా పనిచేస్తామని చెప్తున్నారని విశ్లేషిస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా మోదీకి 75 ఏండ్ల వయసు నిబంధన నుంచి మినహాయింపు ఉన్నదని మోహన్ భాగవత్ గతంలో వ్యాఖ్యానించారని, కానీ ఇప్పుడు ఎవరైనా రిటైర్ కావాల్సిందేనని పరోక్షంగా అల్టిమేటం జారీ చేశారని చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా మోదీ రిటైర్మెంట్ ఖాయమని ఆరెస్సెస్ వర్గాలు చెప్తున్నాయి. విద్యాసాగర్‌రావు, వెంకయ్యనాయుడు, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా తరహాలోనే మోదీని కూడా సాగనంపుతారని స్పష్టం చేస్తున్నాయి.
మోదీ మద్దతుదారులు మాత్రం 75 ఏండ్ల నిబంధనేమీ లేదని, మోదీ కొనసాగుతారని చెప్పుకుంటున్నారు. ‘నేను జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ ఇప్పటివరకు పార్టీలో 75 ఏండ్ల నిబంధన ఏమీ లేదు. అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. పార్టీ రాజ్యాంగంలోనూ ఎక్కడా పొందుపరుచలేదు’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బల్లగుద్దిమరీ చెప్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఓ సందర్భంలో ‘పార్టీ రాజ్యాంగంలో ఇలాంటి నిబంధన లేదు’ అని స్పష్టం చేశారు. మరికొందరు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ఉదంతాన్ని ఉదహరిస్తున్నారు.
2019లో ఆయన 76 ఏండ్ల వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని చెప్తున్నారు. సంఘ్‌లో శారీరకంగా ఫిట్‌గా ఉన్నంత కాలం పనిచేస్తారని, వయసు పరిగణనలోకి తీసుకోరని చెప్తున్నారు. గతంలో ఆరెస్సెస్ చీఫ్లుగా పనిచేసినవారు 79 ఏండ్ల వరకు పనిచేశారని అంటున్నారు. ఇదే సిద్ధాంతం బీజేపీకీ వర్తిస్తుందని, కాబట్టి 75 ఏండ్ల నిబంధన లేదని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా రిటైర్మెంట్ వయసు అటు ఆరెస్సెస్, ఇటు బీజేపీ మధ్య కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ, ఆరెస్సెస్ మధ్య పొసగడం లేదని సంఘ్ వర్గాలు తెలిపాయి. పార్టీని తన గుప్పిట్లోకి తీసుకునేందుకు సంఘ్ ప్రయత్నిస్తున్నదని చెప్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుందని పేర్కొంటున్నారు. తెలంగాణలో అధ్యక్ష పదవి ఈటల రాజేందర్‌కు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి రామచందర్రావును ఎంపిక చేశారు. ఏపీ అధ్యక్ష ఎన్నిక సమయంలోనూ బీజేపీలో అనేక కొత్త పేర్లు బయటికి వచ్చినా, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న మాధవ్‌నే ఎంపిక చేశారు. ఇతర రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి.
ఇలా మెల్లగా పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఆరెస్సెస్ భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీని ని నిలువరించేందుకు బీజేపీ నేతలు సై తం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అం దుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి ఇంకా ఎంపిక కాలేదని చెప్తున్నారు. ఇంతకాలం కుర్చీని ఖాళీగా ఉండటం కూడా ఇదే మొదటిసారి అని చెప్పుకుంటున్నా రు. సమయానికి పదవులు మారిపోతుంటాయని, ఈసారి ఇలా జరగలేదంటే రెం డు వ్యవస్థల మధ్య ఘర్షణ కొనసాగడానికి ఇదొక నిదర్శనమని వెల్లడిస్తున్నారు.