కల్వకుర్తి, నవంబర్ 24 : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతి కేసులో సీఎం సోదరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సాయిరెడ్డి సూసైడ్‌నోట్ పక్కనబెట్టి సీఎం రేవంత్‌రెడ్డి సోదరులపై ఈగ వాలకుండా కొమ్ముకాస్తున్న పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూనిటీ దవాఖాన మార్చూరీలో సాయిరెడ్డి భౌతికకాయం వద్ద ఆదివారం ఆయన నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం దవాఖానలో ఆవరణలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సోదరుల తీరుతో అవమానభారానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
ఈ కేసులో నిందితుల కాలం ఖాళీగా ఉంచి 108 బీఎన్ఎస్ సెక్షన్ ఊసే లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని అన్నారు. మరణ వాంగ్మూలం నోట్‌ను పోలీసులు మాయం చేసి.. బీఎన్ఎస్ 108 సెక్షన్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ తమ వద్ద లేదని బుకాయిస్తున్న పోలీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్న లేఖ ఆధారంగా కేసు నమోదు చేయొ చ్చు కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా? అని నిలదీశారు. అవసరమైతే సీఎం సోదరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.