హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణలో దోచుకున్న సొమ్ములో వెయ్యికోట్లు కేరళలో పంచి అక్కడ ఆ పార్టీ గెలుపు కోసం కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఇయ్యాల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు క్యాబినెట్ మొత్తం కేరళలో ఉన్నది. వీళ్లంతా అక్కడ ఎందుకున్నరో తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్లకు మలయాళం వస్తదా? ఒక్క మంత్రికైనా? అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా ఇంగ్లిష్‌లో ఏమైనా స్పీచులిస్తరా? పోనీ వీళ్లు హిందీలో మాట్లాడుతరా? పటాన్పేటలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏం చేస్తున్నరు? బల్మూరి వెంకట్ ఏం చేస్తున్నరు? ఉత్తమ్ పద్మావతి ఏం చేస్తున్నరు? వీళ్లు ఇక్కడ ఏవైతే డబ్బులు దోచుకున్నరో.. ఆ వెయ్యి కోట్లు తీస్కపోయి అక్కడ పంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కుట్ర చేస్తున్నరు’ అని తేల్చిచెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీకణంలో తెలంగాణ ప్రయోజనాలే దాగి ఉంటాయని ఆర్ఎస్పీ స్పష్టంచేశారు. నది నీరు ఎత్తయిన ప్రాంతాలకు తరలించిన దార్శనికుడని కొనియాడారు. రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకణంలో స్వార్థప్రయోజనాలు, ఏపీ ప్రయోజనాలే ఇమిడి ఉంటాయని విమర్శించారు. మేడిగడ్డ పిల్లర్ కూలిపోలేదని, దానిని పేల్చేశారని, ఇసుక దోపిడీ కోసమే ఆ పిల్లర్‌కు మరమ్మతులు చేయించడం లేదని ఆరోపించారు. కమీషన్ల కోసమే సీఎం సాగునీటి రంగాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. కేరళ ఎన్నికల్లో ఇక్కడి కాంగ్రెస్ మంత్రులకు ఏం పని? అని నిలదీశారు. సాగునీటి ప్రయోజనాల కోసం తెలంగాణ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఢిల్లీపై ఒత్తిడి పెంచేందుకు వారెందుకు రాజీనామా చేయరు? అని, వారేమైనా ఉత్సవ విగ్రహాలా? అని ఎద్దేవా చేశారు. హేట్ స్పీచ్ బిల్లు తెలంగాణ ప్రజలకు ముకుతాడు లాంటిందని, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపినా ప్రజలు ప్రశ్నించడం ఆపొద్దని కోరారు.