పాట్నా: బీహార్లో కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. కంచుకోటలో బీజేపీని మట్టికరిపించారు. తొలిసారి ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. అలాగే ఆయన పార్టీకి తొలి ఎన్నికల విజయాన్ని సొంతం చేశారు. (Prashant Kishor) సోమవారం జరిగిన కౌంటింగ్లో ప్రశాంత్ కిషోర్ 63,203 ఓట్లు సాధించారు. 44,250 ఓట్లు పొందిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాను 18,953 ఓట్ల తేడాతో ఓడించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 14,085 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
కాగా, తొలి ఎన్నికల పోటీలో గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. బంకీపూర్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన తక్షణ ప్రాధాన్యత అని తెలిపారు. ‘ఈ విజయం తర్వాత మా మొదటి ప్రాధాన్యత బంకీపూర్ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని, మాకు అందించిన ఆశీర్వాదాలను గౌరవించడం. బంకీపూర్ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తాం. రాబోయే రెండు మూడు నెలల్లోనే ఆ మార్పులు మీకు కనిపిస్తాయి’ అని అన్నారు.
మరోవైపు అతిగా ఆశలు పెట్టుకోవద్దని బంకీపూర్ నియోజకవర్గం ప్రజలకు ప్రశాంత్ కిషోర్ సూచించారు. ఎమ్మెల్యేగా తన ఎన్నిక బంకీపూర్ను ‘రాత్రికి రాత్రే బెంగళూరుగా’ మార్చదని అన్నారు. అయితే రాబోయే కొద్ది నెలల్లోనే స్పష్టమైన అభివృద్ధి పనులు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు.
కాగా, ఈ తీర్పు బీజేపీ నాయకత్వానికి ఒక రాజకీయ సందేశాన్ని ఇచ్చిందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ‘బీహార్ ముఖ్యమంత్రిగా ఒక మంచి వ్యక్తిని నియమించాలని బాంకీపూర్ ప్రజలు బీజేపీ నాయకత్వానికి స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఎంపికయ్యే వ్యక్తి సమర్థుడై, నిజాయితీపరుడై ఉండాలి. అసలు ముఖ్యమైన విషయం బీహార్ అభివృద్ధి’ అని ఆయన అన్నారు.