RS Praveen Kumar | ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజల ప్రాణాలకు, తాగునీటికి, రైతుల సాగు నీళ్లకు, విద్యార్థుల స్కాలర్షిప్లు, పథకాలకు గ్యారెంటీ ఇవ్వడం లేదని.. కేవలం ప్రచార ఆర్భాటం తప్పా మరికొటి లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తన భావజాలానికి దగ్గరగా ఉన్న పార్టీ అన్నారు. అందుకే అందులో చేరుతున్నట్లుగా ప్రకటించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి పాలన వదిలేసి, ప్రచారం చేసుకోవడంలోనే ప్రపంచానికి వైబ్రెంట్‌గా ఉన్నారని.. నిజంగా ప్రజలకు సేవ చేయడం లేదని విమర్శించారు. ప్రాణహిత-గోదారి, తుంగభద్ర-కృష్ణ నదులుగా తెలంగాణవాదం, బహుజనం వాదం రెండూ ఒక్కటేనన్నారు. ఒకప్పుడు తెలంగాణవాదం, బహుజనవాదం అణచివేయబడ్డాయన్నారు.
పోరాటాల ద్వారా, ఉద్యమకారులను కలుపుకొని కేసీఆర్ విముక్తి కల్పించారన్నారు. సీఎంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఓ పదేండ్లపాటు స్వర్ణయుగాన్ని చూసిందన్నారు. నాడే తెలంగాణకు ఓ బలమైన, గొప్ప పునాది పడిందన్నారు. అందుకే అధికారం లేకపోయినా ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారన్నారు. చాలామంది నేతలు బీఆర్ఎస్ను వీడిపోతున్న తరుణంలో పెద్ద బలగంలా వచ్చిన తనను హక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బహుజనవాదం అంటే స్వార్థపరులు ఉండేదికాదని, బహుజనవాదులు అంటే నిస్వార్థపరులు, సేవ కోసం వచ్చేవారేనన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బహుజనవాదులంతా కేసీఆర్ వెంట నడువాలని వచ్చినట్లు తెలిపారు. బలమైన తెలంగాణను నిర్మించే యజ్ఞంలో భాగస్వాములు కావాలనుకుని బీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు. తనతో పాటు వచ్చిన బహుజనులకు, అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన గుండెల్లో బహుజనవాదం, మహనీయులు, అమరుల త్యాగాలు ఎప్పటికీ ఉంటాయని గుర్తు చేశారు. తెలంగాణ అమరవీరుల సారాంశంతో, వాళ్లు చూపిన దిశవైపు నడుస్తున్నానని తెలిపారు. తనలో ఎలాంటి స్వార్థం లేదని.. బహుజనులంతా తనను అర్థం చేసుకోవాలని ఆర్ఎస్పీ కోరారు.
‘పాలమూరు బిడ్డనని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి నేను కూడా పాలమూరు బిడ్డనే. ఒకవైపు నన్ను సుతిమెత్తగా పొగుడుతూనే.. మరోవైపు సుతిమెత్తగా వార్నింగ్‌లు ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తానని సీఎం ఇచ్చిన ఆఫర్ వస్తావమే. నేను దానిని తిరస్కరించింది కూడా వాస్తవమే. కారణం నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. బీఆర్ఎస్ వైపు వెళ్తే ప్రజలకు సమాధానం చెప్పాలని బెదిరింపులకు దిగుతున్నారు. వాటికి భయపడేది లేదు’ అంటూ సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజలకు ఏ పార్టీలోకి వెళ్లాలో, వెళ్లకూడదో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదా? అంటే మీరు మాకు వార్నింగ్ ఇస్తున్నారా?’ అని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్లో ఎందుకు చేరకూదని.. అదేమన్నా అంటరాని పార్టీనా ? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ఆమాత్రం స్వేచ్ఛలేదా? అని అన్నారు. ఎక్కడ గేట్లు ఓపెన్ చేస్తే.. అక్కడికే వెళ్లాలా? అని సీఎం వ్యాఖ్యలను ఖండించారు.
ముఖ్యమంత్రి గేట్లు తెరిస్తే పోయినోళ్లంతా పిరికిపందలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారంతా కాపాడుకునేందుకు అక్కడకు వెళ్తున్నారన్నారు. ఇక్కడ తనవెంట వచ్చేవారంతా తమ ఆస్తులను వదిలేసి.. తెలంగాణనే తమ ఆస్తి అనుకొని వచ్చినవారన్నారు. తెలంగాణ రాష్ట్రసాధనలో బలమైన పునాదులు వేసిన బీఆర్ఎస్లో ఉంటూ.. అక్రమంగా సంపాదించుకున్న వారే పార్టీ మారుతున్నారని చెప్పారు. ‘మీరు గేట్లు ఎత్తితో చాలామంది పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు ఆ గేట్ల నుంచి గొర్ల మందల్లా వస్తున్నారు. ఆ గొర్రెల మందలో ప్రవీణ్‌కుమార్ ఒకడు కాలేడు. కాడు కూడా. నిజాయితీతో, నిస్వార్థంగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే నాయకుడ్ని కాబట్టే.. ఆ గొర్ల మందలో కలువలేదని అక్కసుతో ఆ మాటలు అంటున్నవా? సీఎంగారు’ అని నిలదీశారు.
‘చాలామంది కేసీఆర్ దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నావని అడుగుతున్నారు. నేను ప్యాకేజీ తీసుకునేవాడ్ని అయితే.. అధికార పార్టీ గేట్ల దగ్గర కూర్చోనే వాడ్ని కదా! నేను ప్యాకేజీల కోసం వచ్చినవాడ్ని కాదు. ప్రశ్నించడానికి వచ్చిన వాడ్ని. తెలంగాణ పునర్నిర్మాణం అనే యజ్ఞంలో భాగస్వామ్యం కావడం కోసం వచ్చాను. దొంగ ఆస్తులను రక్షించుకుందామని వచ్చినవాడ్ని కాదు.. భయంతో వేరే పార్టీలో చేరేవాడ్ని అంతకంటే కాదు. ఉద్యోగం సహా అన్నీ వదులుకొని రాజకీయ రంగంలోకి వచ్చాను. పోలీసు ఉద్యోగాన్ని పక్కనపెట్టి.. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పదేండ్ల పాటు, పది లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేశాను. నాకు పైసలు అవసరం లేదు. ప్రజాసేవనే ముఖ్యం. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి గారు మీ దారిన రాని వాళ్లను బెదిరించడం బంద్చేయాలి. ఎందుకంటే నేను కూడా పాలమూరు బిడ్డనే. నేను కూడా నడిగడ్డ గాలి పీల్చిన.. నడిగడ్డ తిండే తిన్నా. వార్నింగ్‌లు ఇవ్వొద్దు. హోదాను తగ్గించుకోవద్దు’ అని హితవు పలికారు. తనను నమ్మి, చివరి వరకు కలిసి ప్రయాణం చేసేందుకు వచ్చిన వారందరికీ, రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.