RS Praveen Kumar | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30 శాతం ఓటు షేర్ నమోదు చేసుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక శాఖలను తన దగ్గరే పెట్టుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని అన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ రాబడి పూర్తిగా పడిపోయిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మూడు రోజుల ముందే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. కనీసం 15 రోజుల టైమ్ ముందే షెడ్యూల్ ఇవ్వాలి.. కానీ వారం రోజుల్లోనే అన్నీ పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మమ అనిపించిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు కోడ్ ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వారికి ఎన్నికల అధికారులు అండగా నిలిచారని అన్నారు. కోడ్ ఉల్లంఘించినా నోటీసులు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదని తెలిపారు. వీడియో, ఆధారాలతో సహా చూపించినా సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ద సంస్థలు నీరుగారినట్టేనా అని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 15 శాతం ఓట్లే వచ్చాయని ఆంధ్రజ్యోతి అబద్దాలు రాసిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందని రాధాకృష్ణ కుట్రలు పన్నారని విమర్శించారు. దీనికి రాధాకృష్ణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లెక్కలు కూడా రానివారిని ఎడిటోరియల్‌లో ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు 29 శాతం ఓట్లు వచ్చాయని ఈసీ ప్రకటించిందని తెలిపారు. చరిత్రలో ఏ ప్రతిపక్ష పార్టీకి స్థానిక సంస్థల్లో ఇంత శాతం ఓటింగ్ రాలేదని పేర్కొన్నారు. ఈ నిజాన్ని ఆంధ్రజ్యోతి తొక్కిపెట్టిందని మండిపడ్డారు. ఈసీ ప్రకటన తర్వాత ఆంధ్రజ్యోతి సవరణలు చేసిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు కొన్ని పత్రికలు తప్పుదారి పట్టిస్తున్నాయని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు గురించి మళ్లీ లీకులు ఇస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అదొక లొట్టపీసు కేసు అని ఇప్పటికే చెప్పామని అన్నారు. కాంగ్రెస్ ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా ప్రజాపక్షం బీఆర్ఎస్ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెసోళ్లు ఇతర పార్టీల కౌన్సిలర్లను కిడ్నాప్‌లు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చిందని తెలిపారు. అక్కడ ఒక ఇండిపెండెంట్ బీఆర్ఎస్కు మద్దతిచ్చాడని తెలిపారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో ట్యాపింగ్ ద్వారా గుర్తించి, అక్కడికి పోలీసులను పంపించారని పేర్కొన్నారు. వాళ్లేమైనా దొంగతనం చేసి క్యాంపులో కూర్చున్నారా అని ప్రశ్నించారు. అక్కడికి పోలీసులను పంపించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఇంత కసి, దుర్మార్గం ఎందుకు అని ప్రశ్నించారు.
ఎక్స్అఫీషియో ఓటుకోసం కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండే విఠల్‌కు ఓటు హక్కు కల్పించడంపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. దండే విఠల్ ఓటు సనత్‌నగర్‌లో ఎప్పుడు డిలీట్ అయ్యిందని ఆయన ప్రశ్నించారు. హఠాత్తుగా ఆయనకు కాగజ్‌నగర్‌లో ఓటు ఎలా వచ్చిందని నిలదీశారు. కాంగ్రెస్ – బీజేపీలది అపవిత్ర కూటమి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దోపిడీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ వీరోచిత పోరాటం చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ వెంట ప్రజలంతా నడుస్తున్నారని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ధర్మపురి అర్వింద్‌ది నోరా? మోరీనా అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. పోలీసులను తన్నుకుంటూ పోవాలని అర్వింద్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జగ్గారెడ్డి, ధర్మపురి అర్వింద్‌ను ఎందుకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని ప్రశ్నించారు. ఎన్టీవీ జర్నలిస్టులను ఆగమేఘాల మీద అరెస్టులు చేశారని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఒక న్యాయం? కాంగ్రెస్, బీజేపీలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.