RS Praveen Kumar | హైదరాబాద్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయమే పోలీసులు వచ్చి హౌస్ అరెస్టు చేయడం ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు.
సరూర్ నగర్ సదస్సుకు హైకోర్టు, మల్కాజ్గిరి సీపీ సుమతి అనుమతులు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉందని అన్నారు. మా ప్రాథమిక హక్కులను కాలరాసేలా అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ఓ వైపు సంవిధాన్ బచావో అంటూనే, మరోవైపు హక్కులను కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపిస్తుందని అన్నారు. మళ్లీ సిగ్గులేకుండా ప్రజాపాలన అంటున్నారని మండిపడ్డారు.
ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ @KTRBRS గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు!
ఇదెక్కడి న్యాయం?… pic.twitter.com/pAICSQ3H2w
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 18, 2026
ఆది నుంచి బీఆర్ఎస్ సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారని సీఎం, హోంమంత్రి రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెన్ని అడ్డంకులు సృష్టించినా సభకు పోతానని స్పష్టం చేశారు. యువ సంగ్రామ సదస్సుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోతే తన నివాసంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని డీజీపీని కోరారు.